– జిల్లాలో సమర్థవంతమైన బృందాలు పనిచేస్తున్నాయి
– స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు
– 16 విభాగాల నోడల్ అధికారుల సమీక్షా సమావేశంలో ఎన్నికల పరిశీలకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయని.. ఇక్కడ సమర్థవంతమైన బృందాలు పనిచేస్తున్నాయని, ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలుచేసేందుకు సమాచారం, నిఘా ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్ కీలకమని జిల్లా ఎన్నికల పరిశీలకులు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆధ్వర్యంలో జరిగిన 16 విభాగాల నోడల్ అధికారుల సమీక్షా సమావేశంలో సాధారణ పరిశీలకులు మంజూ రాజ్‌పాల్, నరీందర్ సింగ్ బాలి; పోలీస్ అబ్జర్వర్ ప్రీతీందర్ సింగ్; ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్, సౌరభ్ శర్మ, మదన్ కుమార్‌తో పాటు సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్ డిల్లీరావు జిల్లా ఎన్నికల ప్రణాళికలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సాఫీగా సాగిందని.. తదుపరి ఈవీఎంల ర్యాండమైజేషన్, కమిషనింగ్ తదితర పనులను ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 2024, మార్చి 16 నుంచి ఏప్రిల్ 27 వరకు చూస్తే రూ. 3.33 కోట్ల నగదు, రూ. 45.82 లక్షల విలువై మద్యంతో పాటు మొత్తం రూ. 6.79 కోట్ల విలువైన సీజర్లు జరిగినట్లు వివరించారు. ఓటర్ హెల్ప్‌లైన్, ఎన్‌జీఎస్‌పీ, కాల్‌సెంటర్, సీ విజిల్ తదితర మార్గాల ద్వారా 1,993 ఫిర్యాదులు రాగా 1,974 ఫిర్యాదుల పరిష్కారం పూర్తయినట్లు వివరించారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపరాఉ. పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ.. ఎంసీసీ ఉల్లంఘనలు, సీజర్స్ కేసులు, చెక్‌పోస్టుల వద్ద నిఘా తదితర అంశాలను వివరించారు. జిల్లాకు అదనపు బలగాలు రానున్నాయని తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను వివరించారు.
జనరల్ అబ్జర్వర్ మంజూ రాజ్‌పాల్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో సమర్థవంతమైన అధికారులు పనిచేస్తున్నారని.. ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్ల పరిశీలనకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మరో జనరల్ అబ్జర్వర్ నరీందర్ సింగ్ బాలి.. వేసవి నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వద్ద చేయనున్న ఏర్పాట్లపై పలు సూచనలిచ్చారు. పోలీస్ పరిశీలకులు ప్రీతీందర్ సింగ్.. సమాచార, నిఘా ఆధారిత ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ఎలాంటి ప్రలోభాలు లేని వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యల్లో భాగంగా సీజర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అమలుచేయడం జరుగుతోందని.. ప్రతి సమాచారమూ చాలా విలువైనదని పేర్కొన్నారు.
సమావేశంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీసీపీలు అధిరాజ్ సింగ్ రాణా, కె.శ్రీనివాసరావు తదితరులతో పాటు విజయవాడ ఆర్‌డీవో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆర్‌వో బీహెచ్ భవానీ శంకర్, కేఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఆర్‌వో ఇ.కిరణ్మయి, తిరువూరు ఆర్‌డీవో కె.మాధవి, నందిగామ ఆర్‌డీవో ఎ.రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News