శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరియు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రధానాలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి అర్చకులు, వేదపండితులు మంగళవాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రత్నగర్భగణపతిస్వామి వారిని, శ్రీ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం, శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లకు కుంకుమార్చన జరిపించారు. అనంతరం భారత రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్లను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శేషవస్త్రాలను, లడ్డుప్రసాదాలను మరియు శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాష్ట్రపతికి డిప్యూటీ సీఎం కొట్ట సత్యనారాయణ దేవాలయ విశిష్టతలను గురించి మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటిగా ఈ ఆలయం ఉందని మరియు శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే ఆలయ ప్రాంగణంలో వెలిసిన ఏకైక క్షేత్రంగా శ్రీశైలం ప్రసిద్ది పొందిదని మంత్రి ఆమెకు వివరించారు.
అనంతరం నంది సర్కిల్ సమీపంలోని టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌లో (యాత్రికుల సదుపాయ కేంద్రం) రూ. 47.23 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం క్రింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
అనంతరం శ్రీశైలం దేవాలయం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 120 కోట్లతో క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి, ఫస్ట్ ఫేస్ కింద 50 కోట్లు నిధులు మంజూరు చేయవలసిందిగా కేంద్రం టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి రికమండ్ చేయవలసిందిగా రాష్ట్రపతి ముర్ముకు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వినతి పత్రం అందజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ద్వారా ఈ నిధులు విడుదల చేయాల్సిందిగా మంత్రి రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. అలాగే పక్కనే ఉన్న కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా వినతి పత్రం అందించగా ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేస్తాను అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రాష్ట్రపతికి ముర్ము గారికి మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News