-ఇదొక శుభ పరిణామం
-ఉత్తర కాశీ నుండి దక్షిణ కాశీకి కూడా బుల్లెట్ ట్రైన్ అవసరం ఉంది
-కోస్తా ఏరియాలో కొత్త లైన్లు, కొత్త రైళ్ళు మరిన్ని రావాలి
-ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికీ కృతజ్ఞతలు
-రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం నుండి సికింద్రాబాదు కు ‘వందే భారత్’ హై స్పీడు బుల్లెట్ రైలు సేవలు అందించిన ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ నుండి విశాఖ ‘వందే భారత్’ రైల్ తొలిసారిగా రాజమండ్రి రైల్వే స్టేషనుకు రావడంతో మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. రాజమండ్రి ఎంపీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత తదితరులు బుల్లెట్ రైలును ఆసక్తిగా తిలకించారు. ట్రైన్ ఎక్కి బోగీలను, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను తిలకించారు. కొద్ది సేపు చైర్ కార్ లో ఎంపీ, కలెక్టర్ కూర్చుని రైల్వే అధికారులతో ముచ్చటించారు. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విశాఖపట్నం వైపు వెళుతున్న ‘వందే భారత్’ బుల్లెట్ ట్రైన్ కు ఎంపీ భరత్, కలెక్టర్ మాధవీలత జెండా ఊపి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎంపీ ఏం. భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ 2023 కొత్త సంవత్సరం ఆరంభంలో ప్రారంభించిన ఈ బుల్లెట్ రైలు రైల్వే శాఖకు ఒక సంచలనం, సరికొత్త రికార్డు తీసుకు రాగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాలంతో పాటు పరుగులు తీస్తున్న ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ఇటువంటి రైళ్ళు మరిన్ని రావాలన్నారు. వర్తక, వాణిజ్య రంగాలలో వారే కాకుండా చాలామంది విమాన ప్రయాణాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని, చాలా త్వరగా గమ్యానికి చేరుకోవాలనే ఆలోచనతో సంపన్నులు రైలు ప్రయాణం కంటే విమానయానానికే ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో ‘వందే భారత్’ బుల్లెట్ ట్రైన్ రైల్వే శాఖకు ఒక సువర్ణాధ్యాయనమే అన్నారు.
జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరీ జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరం లో వందే భారత్ రైల్ కు స్టాప్ పెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈనగరానికి గల ప్రాధాన్యత కు ఇప్పుడు వందే భారత్ రైల్ నిలుపుదల చెయ్యడం ద్వారా మరింతగా ప్రతిష్ట పెరగనుందని అన్నారు. ఈ నగరం లో స్టాప్ పెట్టడం లో స్థానిక ఎంపి మార్గని భరత్ రామ్ కృషి అభినందనీయమన్నారు. హైదరాబాద్, విజయవాడ కి, విశాఖపట్నం కి ఈ రైల్ ప్రయాణం ఎంతో సౌకర్యంతో కూడుకున్నదని అన్నారు.
ఉత్తర కాశీ నుండి దక్షిణ కాశీకి బుల్లెట్ ట్రైన్ అవసరమే…
ఉత్తర కాశీ నుండి దక్షిణ కాశీ (రాజమండ్రి) కి కూడా ఇటువంటి వేగవంతమైన అధునాతన బుల్లెట్ ట్రైన్స్ చాలా అవసరమని ఎంపీ భరత్ తెలిపారు. కొవ్వూరు-భద్రాచలానికి కొత్త రైలు అవసరం ఉందన్నారు. ఇదే విషయమై అనేక సార్లు పార్లమెంటులో ప్రస్తావించినట్టు చెప్పారు. అలాగే కోస్తా ప్రాంతంలో పలు కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ళు వేయవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా ఎంపీ భరత్ గుర్తు చేశారు. ట్రాక్స్ అన్నీ అప్గ్రేడ్ చేసి, ఎల్సీ గేట్లను పూర్తిగా క్లోజ్ చేసి, అవసరం ఉన్నచోట ఎల్వోబీ, ఆర్వోబీ తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. అలాగే భద్రత విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ సూచించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం నుంచి సికింద్రాబాద్ కు ప్రయాణికుల అవసరాన్ని గుర్తించి ‘వందే భారత్’ బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రధాన మంత్రి మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి పర్వదినాన ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో పచ్చ జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషను లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, ఎపి ఖాధి బోర్డ్ చైర్మన్ పిల్లి నిర్మల, స్థానిక నాయకులు అడపా శ్రీ హారి, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, రైల్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు. తొలిసారిగా రాజమహేంద్రవరం కి చేరుకున్న రైల్ ను వివిధ స్కూల్స్ కి చెందిన విద్యార్థిని, విద్యార్ధులు ఎంతో ఆసక్తి గా తిలకించారు.
Prajavartha Online Telugu News