-కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కు లేఖ రాసిన సియం చంద్రబాబు
-కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను సెంట్రల్ పోర్టల్ లో నమోదు కోసం గడువు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కు లేఖ వ్రాసారు.వక్ఫ్ ఆస్తి వివరాలను సెంట్రల్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి గడువు డిసెంబర్ 5వ తేది తో ముగియనున్నది.
రాష్ట్రంలో దాదాపు 4,748 రిజిస్టర్డ్, 10,000 దాకా అన్ రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,100 ఆస్తులకు వివరాలను విజయవంతంగా అప్‌లోడ్ చేసినప్పటికీ, సాంకేతిక సమస్యలు, స్టేక్ హోల్డర్ల సమస్యల కారణంగా పురోగతికి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలగడం జరుగుతున్నదని లేఖలో సీఎం చంద్రబాబు వివరించారు.ఆస్తుల నమోదు ప్రక్రియ వేగం పుంజుకున్నప్పటికి డిసెంబర్ 5వ తేదీ నాటికి అన్ని రిజిస్టర్డ్, రిజిస్టర్ కాని ఆస్తులకు సంబంధించిన మిగిలిన అప్‌లోడ్ పనిని పూర్తి చేయడం కోసం గడువు సరిపోదని వెల్లడించారు.ఈ గడువును దాటితే ఇది వక్ఫ్ ఆస్తుల చట్టపరమైన అంశాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వాటాదారులలో ఉందని పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు 100 శాతం చర్యల కోసం, ఖచ్చితమైన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రస్తుత గడువును 12 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కోరారు. వక్ఫ్ ఆస్తుల రక్షణను దృష్టిలో పెట్టుకుని మరో ఏడాది పాటు గడువు పెంపు కోసం లేఖ రాసిన సీఎం చంద్రబాబుకు మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కృతజ్ఞతలు తెలుపుతూ అమరావతిలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
=================
హైకోర్టు న్యాయమూర్తుల గ్రాట్యూటీ పరిమితి పెంపు
రూ. 20 లక్షల నుండి 25 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ
భారత ప్రభుత్వపు కేంద్ర న్యాయశాఖ లేఖను అనుసరించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు గ్రాట్యూటీ పరిమితిని పెంచుతూ రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సోమవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 1.1.2014 నుండి గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.20 లక్షలు నుండి రూ.25 లక్షలుకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
Prajavartha Online Telugu News