Breaking News

మత విద్వేషాలను రెచ్చగొట్టడం సోము వీర్రాజు మానుకోవాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం
-సర్వ మతాలను సీఎం వైఎస్ జగన్ పరిరక్షిస్తున్నారు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను బుధవారం ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వ మతాల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని వెల్లడించారు. అటువంటి పార్టీపై దేశంలోనే మతతత్వ పార్టీగా ముద్ర పడిన బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించడం హాస్యాస్పదమన్నారు. సమాజంలో చీలికలు తీసుకువచ్చేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. చివరకు పుణ్యక్షేత్రాలను కూడా మీ కుట్ర రాజకీయాలలోకి లాగుతుండటం సిగ్గుచేటన్నారు. శైశైలంలో ఒకలా, అంతర్వేదిలో మరోలా, విజయవాడలో ఇంకోలా మాట్లాడటం సోము వీర్రాజుకే చెల్లిందన్నారు. సోము వీర్రాజుకు ఆయ‌న నోరే శ‌త్రువైంద‌ని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలసి ఉండాలన్నదే వైఎస్సార్ సీపీ లక్ష్యమని, జగనన్న అభిమతం కూడా అదేనని ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో జరుగుతోన్న సంక్షేమం, అభివృద్ధి బీజేపీ చలవేనంటూ సోము వీర్రాజు మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టే ట్యాక్సులతోనే కేంద్రానికి నిధులు వస్తున్నాయన్న చిన్న విషయం కూడా సోము వీర్రాజుకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని ఎవరూ పట్టించుకోరని, కనుకనే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మీ బీజేపీ నాయకులు ఏం మాట్లాడారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. కేంద్ర మంత్రులు పదే పదే రాష్ట్రానికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతేనా..? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటోందని పేర్కొన్నారు. కానీ తెలుగుదేశం హయాంలో బీజేపీ భాగస్వామ్యంతోనే ఆలయ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని గుర్తుచేశారు. సీఎం జగన్‌ పాలనలో హిందుత్వ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీ మాదిరిగా హిందూ ఆలయాల్లో పరిరక్షణ చర్యలు లేవన్నారు. సోము వీర్రాజుకు ధైర్యముంటే రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడాలని సూచించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలు మానుకోవాలని హితవు పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *