విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
‘యు టి ఎస్’ మొబైల్ యాప్ ద్వారా సాధారణ టికెట్లు కొనుగోలుకు సంబంధించిన దూర పరిధిని విస్తరించడం జరిగింది. సబర్బన్ స్టేషన్ల నుంచి ప్రయాణించే వారు 10 కిలోమీటర్ల లోపు పరిధిలో, ఇతర స్టేషన్ల నుంచి ప్రయాణించే వారు 20 కిలోమీటర్ల లోపు పరిధిలో టికెట్లను కొనవచ్చు. అన్ రిజర్వుడ్ టికెట్లను ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా కొనే సదుపాయం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ‘యు టి ఎస్’ మొబైల్ అప్లికేషన్ ను 2018లో ప్రవేశపెట్టింది. ఈ యాప్ కు అన్ని వర్గాల రైలు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ యాప్ వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతీయ రైల్వే ఈ యాప్ వాడకాన్ని మరింత ప్రోత్సహించడానికి దూరానికి సంబంధించిన పరిమితిని విస్తరించారు. తద్వారా రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారు డిజిటల్ పద్ధతిలో టికెట్లు కొనే వెసులుబాటు కలుగుతుంది. ‘యు టి ఎస్’ యాప్ ద్వారా రిజర్వు చేయని టికెట్లు సబర్బన్ స్టేషన్ల నుంచి కొనడానికి ఇప్ప్పుడున్న 5 కిలోమీటర్ల గరిష్ట దూరాన్ని 10 కిలోమీటర్లకు, అన్య (సబర్బన్ కానీ) స్టేషన్ల నుంచి కొనడానికి ఇప్ప్పుడున్న10 కిలోమీటర్ల గరిష్ట దూరాన్ని 20 కిలోమీటర్లకు పెంచారు.
తదనుగుణంగా అన్ రిజర్వుడ్ టికెట్లను:
• సబర్బన్ స్టేషన్ల విషయంలో ప్రయాణ ప్రారంభ స్టేషన్ నుంచి 15 మీటర్ల పైన 10 కిలోమీటర్ల లోపు పరిధిలో టికెట్లను కొనవచ్చు.
మరియు
• ఇతర స్టేషన్ల విషయంలో ప్రయాణ ప్రారంభ స్టేషన్ నుంచి 15 మీటర్ల పైన 20 కిలోమీటర్ల లోపు పరిధిలో టికెట్లను కొనవచ్చు.
సాధారణంగా భారతీయ రైల్వేలలో ఎక్కువ మంది ప్రయాణీకులు అన్ రిజర్వుడ్ టికెట్ల పైనే జనరల్ బోగీలలో ప్రయాణం చేస్తారు. అలాంటి వారికి యుటిఎస్ మొబైల్ యాప్ రైలు టికెట్లను కొనేందుకు సాఫీయైన సదుపాయం. ఈ యాప్ ఆండ్రాయిడ్ , ఐ ఓ ఎస్, విండోస్ రకం ఆపరేటింగ్ సిస్టం ఉన్న స్మార్ట్ ఫోన్లు అన్నింటిలో పనిచేస్తుంది. ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వాడటం వల్ల ప్రధానంగా కలిగే ప్రయోజనాలు ఏమిటంటే ప్రయాణీకులు రిజర్వు చేయని, ప్లాట్ ఫారం మరియు సీజన్ టికెట్లను తమ మొబైల్ ద్వారా (నగదు రహిత) తమకు అనుగుణంగా బుకింగ్ కౌంటర్ వద్ద క్యూలో నిలవాల్సిన పని లేకుండా కొనవచ్చు. కాగిత రహితం కావడం వల్ల పర్యావరణ హితమైనది. వివిధ రకాల వాలెట్లు ఆర్ -వాలెట్, పేటిం, మోబిక్విక్ లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు. ఈ సౌకర్యం అన్ రిజర్వుడ్ టికెట్లు తీసుకునే రంగంలో పెద్ద ముందడుగు మరియు రైలు వినియోగదారులకు వరం .
రైలు వినియోగదారులు , ముఖ్యంగా రిజర్వు చేయని బోగీలలో తిరిగే ప్రయాణీకులు స్టేషన్లలో క్యూ లైన్లలో నిలిచి ఉండి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం యుటిఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు కొనాలని దక్షిణ మధ్య రైల్వే ఇంచార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News