గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్ల విస్తరణ పూర్తి అయిన ప్రాంతాల్లో డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, అందుకు తగిన విధంగా విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, సిపిడిసిఎల్ అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీరింగ్ అధికారులతో, సిపిడిసిఎల్, ఆర్ అండ్ బి అధికారులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర శాఖలతో సమన్వయంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెద్ద పలకలూరు రోడ్, కుగ్లర్ హాస్పిటల్ రోడ్ విస్తరణ పనులు పూర్తీ అయ్యాయని, డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డ్రైన్ల నిర్మాణం అయిన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సిపిడిసిఎల్ అధికారులకు తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ రిజర్వాయర్లకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ఏర్పాటుకు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. విస్తరణ పూర్తి అయిన పెద్ద పలకలూరు, రెడ్డి పాలెం రోడ్లను నిర్మాణం చేయడానికి ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని, లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణం చేసుకునేలా సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్వచ్చ సర్వేక్షణ్ 2023లో భాగంగా టాయ్ లెట్ 2.1 మేరకు నగరంలోని పబ్లిక్ టాయ్ లెట్స్ మరమత్తులు వెంటనే పూర్తి చేయాలని, టెండర్ పొంది వర్క్ అగ్రిమెంట్ అయిన పనులు వేగంగా జరిగేలా చూడాలని ఏ.ఈ.లను ఆదేశించారు. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా చేపట్టిన పనులకు టెండర్ పూర్తి అయిందని, సదరు పనులను అధిక ప్రాధాన్యతగా పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. పనులు పూర్తీ చేసిన వాటికి బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేయాలన్నారు. రైల్వే శాఖతో త్వరలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. సమావేశంలో ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ.లు సుందర్రామిరెడ్డి, శాంతిరాజు, కొండారెడ్డి, కోటేశ్వరరావు, సిపిడిసిఎల్ ఈ.ఈ. శ్రీనివాసబాబు, నగరపాలక సంస్థ డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News