మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి శాసనసభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ ,రహదారులు భవనాలు, రవాణా శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు శాసనసభ్యులు అందరూ కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు మేలు జరిగే పనులను ముమ్మరంగా చేపట్టాలన్నారు. జిల్లా ఖనిజ నిధుల నుండి చేపట్టి 70 నుంచి 80% పూర్తయిన పనులను నూటికి నూరు శాతం త్వరితగతిన పూర్తి చేసి
వినియోగంలోకి తీసుకుని రావాలన్నారు. ప్రమాదాల నివారణ కోసం రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 398 ప్రమాదాలు జరిగాయని అందులో 198 ప్రమాదాలూ జాతీయ రహదారి పైన జరిగాయని, 49 ప్రమాదాలు రాష్ట్ర రహదారిపైన ప్రధానంగా జరిగాయన్నారు. అందులో 177 మరణాలు సంభవించగా 102 మరణాలు జాతీయ రహదారి పైన జరిగాయన్నారు. అతివేగం వలన, సీటు బెల్టు, హెల్మెట్ ధరించకపోవడం వలన ప్రమాదాలు జరిగాయని కలెక్టర్ మంత్రికి వివరించారు అలాగే ఆవులు, గేదెలు కూడా రహదారులపై ఉండటం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని కలెక్టర్ మంత్రికి వివరించారు. ఈ ప్రమాదాల నివారణ కోసం వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు, సీటు బెల్టులు వేసుకునే విధంగా సానుకూల దృక్పథంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మొదట ఈ కార్యక్రమం కలెక్టరేట్ నుండి ప్రారంభించి ప్రతి ఒక్క ఉద్యోగి హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే నాలుగు చక్రాల వాహనాల్లో సీట్ బెల్ట్ వేసుకోకుంటే వచ్చే బీప్ సౌండ్ ను ఆపేందుకు ఉపయోగిస్తున్న బీప్ స్టాపర్లను సీజ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు తమ వంతు సహకారాన్ని అందించి ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు.
ఈ సమావేశంలో గుడివాడ, గన్నవరం,పెడన, పామర్రు శాసనసభ్యులు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు కాగితపు కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, డిఆర్వో కే చంద్రశేఖర రావు, డిటిసి పురేందర్, ఆర్డిఓ ఎం వాణి, సిపిఓ గణేషు, డ్వామా పిడి సూర్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్ ఈ విజయ్ కుమారి, ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాసరావు, డిపిఓ నాగేశ్వర నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News