Breaking News

పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

-రైతులతో కలిసి కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జిల్లా కలెక్టర్ లక్ష్మీశను కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి మంగళవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు మండిన ఎండలతో ఇబ్బంది పడిన అన్నదాతలు, అనుకోకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తడిసిన ధాన్యంతో ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తక్కువ ధరకు మధ్యవర్తులకు విక్రయించి నష్టపోతున్నారని వెల్లడించారు. కనుక కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా మద్దతు ధరపై పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సంచులు సరిపడా నిల్వ ఉంచాలని.. ధాన్యం తరలింపులో ఎక్కడ వాహనాల కొరత రాకుండా, కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేయగా.. సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పైకి రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పటం తప్ప ఇప్పటివరకు వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల మంత్రులు కనీసం సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదన్నారు. జిల్లాలో గత వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా.. సంబంధిత శాఖల అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నట్లు ఆరోపించారు. ఓ వైపు వాతావరణ శాఖ పదేపదే హెచ్చరిస్తున్నా.. అధికార యంత్రాంగం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ, పౌర సరఫరా, రెవెన్యూ అధికారుల కాలయాపనతో రైతులకు అవస్థలు తప్పడం లేదన్నారు. లారీలు రావట్లేదని, వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారని చెప్పారు. కనుక క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ని కోరినట్లు చెప్పారు. అలాగే ధాన్యం తరలింపు లక్ష్యసాధనలో నిర్లక్ష్యంగా వ్యవహరించే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవిరెడ్డి మంగారెడ్డి, వాకాడ రాము, నల్లమోతు చినబాబు, పామర్తి వెంకయ్య, జాజుల నాగేశ్వరరావు, సుబ్బారెడ్డి, శేషిరెడ్డి, యరగొర్ల శ్రీరాములు, రైతులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *