విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెడ్ క్రాస్ సేవల్లో జిల్లా అధికారులు భాగస్వాములు కావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు, కలెక్టర్ యస్ డిల్లీ పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో ఉత్తమ సేవలు అందిస్తున్న కలెక్టర్ డిల్లీరావును ఇటీవల జరిగిన రెడ్ క్రాస్ రాష్ట్ర సమావేశంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బంగారు పతకం, ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యలయంలోని పింగళి వెంకయ్య హాలులో రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ డా॥సమరం, కార్యదర్శి దా॥ ఇళ్ళా రవి, ఇతర సిబ్బంది సోమవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి దిల్లీరావుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో రక్తదానం, మొక్కలనాటడం వంటి కార్యక్రమాలే కాకుండా ఇ- వేస్టేజ్, మాదక ద్రవ్యాల వ్యసనం, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణం పరిరక్షణ, విపత్తుల నివారణ, ప్రథమ చికిత్స, ఆరోగ్య శిబిరాలు, ఉచిత శుక్లాల ఆపరేషన్లు వంటి కార్యక్రమాలను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ప్రాథమిక విద్యాస్థాయిలో గుడ్- టచ్ బ్యాడ్- టచ్ , బాలికలు, మహిళలకు దిశ యాప్ పై అవగాహన కలిగించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు ఇంటిలో ఉన్నవారికి తక్షణం ఎలా స్పందించాలో నేర్పడానికి కాలేజీ యువతకి సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడం గణనీయమైన కృషి అన్నారు. ప్రధానమంత్రి టిబి ముక్తి కార్యక్రమంలో భాగంగా కొన్ని వందల మందికి పౌష్టికాహారం నెలనెలా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం శ్లాఘనీయమన్నారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి అధికారులు రెడ్ క్రాస్ సేవలో భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి చేసారు. రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ డా॥సమరం మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ అందిస్తున్న సహకారం గణనీయమైందన్నారు.
Prajavartha Online Telugu News