రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పర్యావరణ పరిరక్షణ మరియు జల పరిరక్షణ పై న్యాయ విజ్ఞాన సదస్సు ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ మూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందిరి బాధ్యత అని అన్నారు. నేడు మన ముందున్న అతి పెద్ద సమస్య ప్లాస్టిక్ వినియోగం. ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల నీరు, నేల కలుషితం అవుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అన్నారు. దీనితోపాటు ఇంటి నుండి వెలువడే వ్యర్ధాలని తడి చెత్తని పొడి చెత్తని వేరుగా ఉంచాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేయబడిన వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జల, నేల మరియు వృక్ష సంరక్షణ చట్టం, 2002 (AP WALTA Act, 2002), పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 మొదలగు చట్టాల పై అవగాహన కల్పిస్తూ వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడ్వకేట్ జి. కృష్ణ కపూర్ మాట్లాడుతూ చెట్లను సంబంధిత అధికారుల అనుమతి లేకుండా నరకరాదని అన్నారు. సంబంధిత అధికారులకు అర్జీ పెట్టుకుని సరైన కారణం ఉంటే కానీ చెట్లను నరకరాదని అన్నారు. అలా నరికివేయబడిన ప్రతి చెట్టుకి బదులుగా రెండు చెట్లను నాటవలసి ఉంటుదని అన్నారు. డిప్యూటీ డీ.ఎం.హెచ్.వో డా. బి.లూసి కార్డీలియా మాట్లాడుతూ జల వనరులు కాలుష్యం కావడం వల్ల సంభవించే అనేక రుగ్మతల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా అటవీ సంరక్షణ అధికారి బి. నాగరాజు, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీ సంరక్షణ అధికారి ఎం. వి. ప్రసాద రావు, డి. టి. వో. కె. ఎస్. ఎం. వి. కృష్ణ రావు, కోనసీమ జిల్లా డిప్యూటీ తహశీల్దార్ టి. వి. ఎస్. రమా దేవి, డి. పి. టి. వో. డి. విజయ లక్ష్మీ, కాకినాడ జిల్లా ఎస్. ఈ. బి. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్(ఇంచార్జ్) సీ. హెచ్. అజయ్ కుమార్ సింగ్, వివిధ సంస్థల వారు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News