-వరి, ఉద్యాన, వాణిజ్య పంటల రైతులకు అపారనష్టం
-ఖరీఫ్ పంట రుణాల మాఫీకి చర్యలు
-రాష్ట్రానికి ఆర్థిక సాయమందించాలి
-రైతు సంఘాల సమన్వయ సమితి నేతలు వడ్డే, కేవీవీ, కేశవరావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌కు వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంట పొలాల ముంపునకు గురైన రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రైతు సంఘాల సమన్వయ సమితి కోరింది. విజయవాడలోని వివంత్ హోటల్‌లో బస చేసిన కేంద్ర మంత్రిని సమన్వయ సమితి కన్వీనర్, మాజీ వ్యవసాయశాఖామాత్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు నాయకత్వంలో నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో కృష్ణాతీరం, బుడమేరు పరివాహక ప్రాంత పంట పొలాల రైతులతోపాటు ప్రజానీకం నిరాశ్రయిలైనట్లు వారు ఆయనకు వివరించారు. భారీ వర్షాలతో కృష్ణానది, బుడమేరు ఉధృతి, గుంటూరు ఛానల్ ముంపు కారణంగా మానవ, జంతు, ఆస్థి నష్టంతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వాణిజ్య పంటలు మరియు మత్స్య, పాడిరంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయని, చెరకు వంటి కొన్ని పంటలు రోజుల పాటు వరదల నీటిలోనే తేలియాడాయని చెప్పారు. ఉద్యానవన పంటలు సాగుదారులైన రైతులు ఎకరాకు రూ॥ 2.50 లక్షల నుంచి రూ॥ 2.75లక్షలకుపైగా నష్టబోయారని తెలిపారు. పసుపు, మిర్చి, పత్తి, అరటి తోటలు మొదలైన వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వరి రైతులకూ గణనీయమైన నష్టం వాటిల్లిందని, ఆపదలో ఉన్న రైతులకు తగిన సహాయం అందించేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వరదల ఉధృతి కారణంగా పంటలతోపాటు పేద ప్రజల ఇళ్లు దెబ్బతిని వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారన్నానరు. ఇప్పటికే 30 మందికిపైగా చనిపోయారని పశువులు, గొర్రెలు చనిపోయాయని, వేలాది మంది ప్రజలు వరద ముంపుతో నిరాశ్రయులయ్యారని తెలిపారు. నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా పథకం, జాతీయ విపత్తు నిథి ద్వారా సాయమందించాలని వారు కోరారు. పంటలు నష్టపోయిన రైతులకు పూర్తిగా ఖరీఫ్ పంట రుణాలను మాఫీ చేయడానిగాను ప్రభుత్వ, సహకార రంగ బ్యాంకులకు తగిన సూచనలు జారీజేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. వరదల దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు, పూర్తి స్థాయిలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు, కాల్వలు, బుడమేరు డ్రెయిన్లు ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించాలన్నారు. భవిష్యత్‌లో ఈ తరహా ప్రకృతి వైపరీత్యాలు పునరావృతమైతే దేశానికి, ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి విపరీతమైన నష్టం కలిగించే ప్రమాదముందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి విపత్తులు కొనసాగకుండా, విపత్తుల నివారణకుగాను కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు సింహాద్రి రaాన్సీ, కృష్ణయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News