-అడిగిన వారికి లేదనకుండా ఆకలి తీర్చిన డొక్క సీతమ్మ పేరు ఈ పథకానికి పెట్టాం
-ఈ ప్రాంతానికి చెందిన డొక్కా సీతమ్మ పేరు పెట్టిన సిఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకి ధన్యవాదాలు
-విద్యార్థులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించడం మధ్యాహ్న భోజన పథకం ఉద్దేశ్యం
-విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
-ప్రతిభగల ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యం
-పాఠశాల విద్య తరహాలోనే ” సంకల్ప 2025 ” విధానాన్ని ఇంటర్మీడియట్ విద్యలోనూ అమలు చేస్తాం.
-మంత్రి కందుల దుర్గేష్
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతిభగల ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే ఉన్నత ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యం అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ( బాలికలు)లో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని మంత్రి కందుల దుర్గేష్ , జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాకూడదని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యారంగంలో విప్లవ్యాప్తమైన మార్పులను తీసుకురావడం కొరకు అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించటం తథ్యం అన్నారు. ప్రస్తుత సమాజంలో 60 శాతం నుండి 100 శాతం మార్కులు ప్రామాణికంగా మారాయన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో ప్రతి విద్యార్థి చదువుకునేందుకు స్టాండర్డ్స్ తో పాటు డిజిటల్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం “సంకల్ప 2025″ కు శ్రీకారం చుట్టిందన్నారు. పేదరికం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని పట్ల అధ్యయనం చేసి పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు మానకూడదనే జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి , విద్యా శాఖ మంత్రి కి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానన్నారు. కౌమార దశ లో అభ్యసించే విద్య ఇంటర్మీడియట్ అని విద్యార్థులు చెడు ప్రభావాలకు లోను కాకుండా క్రమశిక్షణ పట్టుదలతో తన లక్ష్యాలను సాధించే దిశగా కష్టపడాలన్నారు. వ్యక్తిత్వ వికాశానికి సరైన సమయం ఇంటర్ విద్య అని, ఈ దశలో క్రమశిక్షణతో కష్టపడి విద్యను అభ్యసించడం ద్వారా భవిష్యత్తు బంగారు బాటగా నిలుస్తుందని విద్యార్థులకు మంత్రి సూచించారు. ఇంగ్లీష్ మీడియం విద్య అవసరమే అయినప్పటికీ మాతృభాషను నేర్చుకోవడం తప్పనిసరి అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి జీవోను ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా జారీ చేస్తుందన్నారు. గత ఐదేళ్లలో కళాశాలలో పాఠశాల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మూడో తరగతి నుంచి హైస్కూల్ వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉంటుందన్న విధానం ద్వారా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. దీనివలన డ్రాప్ ఔట్స్ సంఖ్య కూడా పెరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రతి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి విద్యా దశలో కష్టపడి క్రమశిక్షణతో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రైమరీ మరియు సెకండరీ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. గత ఆరు మాసాలుగా పాఠశాల విద్యలో ” సంకల్ప 2025 ” ద్వారా పాఠశాల విద్యలో మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరిగిందని, అదే విధానాన్ని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా కొనసాగిస్తామని కలెక్టర్ తెలిపారు. జూనియర్ కళాశాలలో కూడా పేరెంట్స్ అధ్యాపకుల సమావేశాన్ని నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ పై చర్చిస్తామన్నారు. యూనిట్ పరీక్షలు, సిలబస్, మార్క్స్ అప్డేషన్ వంటి ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఈ విధానాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ స్థాయిలో సమీక్షిస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన విద్యార్థులకు 3 గం. నుంచి సా.5 గంటల వరకు ట్యూషన్ క్లాసులు నిర్వహిస్తు వారికి అర్థమయ్యే ఆయా కోర్సులకు సంబంధించి స్టడీ మెటీరియల్ ను అందిస్తున్నట్లు తెలిపారు. ఐఐటి సంబంధించిన మెటీరియల్ ప్రభుత్వ విద్యార్థులకు సరఫరా చేస్తూ డిజిటల్ విధానంలో భోధన దిశగా అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ప్రతి విద్యార్థికి లక్ష్య సాధనలో ఏకగ్రత అవసరమని, చెడు విషయాలకు దూరంగా ఉండి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థి దశలో ఒకరోజు వృధా అయినా వెనక్కు రాదని, ప్రతి విద్యార్థి మన జిల్లా మన రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలిపే విధంగా కృషి చేయాలన్నారు.
మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ పెద్దలు, గురువులు, సమాజం పట్ల విద్యార్థులకు తరగతి గదులు నుంచే మంచి విషయాలు నేర్పడం ద్వారా సమాజం లోనికి మంచి పౌరులు వస్తారన్నారు. ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సమాజం హితం కోరే మంచి కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ తో కూడిన విద్యా బుద్ధులు అవసరం అన్నారు.
మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ గారు 1841లో జన్మించి 1990 లో కాలం చేశారన్నారు. డొక్కా సీతమ్మ వారి భర్త జోగయ్య గారి సహకారంతో అడిగిన ప్రతివారికి భోజనాన్ని అందించి చరిత్రలో నిలిచారన్నారు. వారి పేరున నేడు ఈ పథకాన్ని అమలు చేయడం శుభ సూచకమన్నారు. ఈ సందర్భంగా పలు విద్యార్థులు డ్రగ్స్ నియంత్రణపై సందేశాన్నిస్తూ అనంతరం ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి. ప్రశాంతి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
కార్యక్రమంలో కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత, డిఈఓ కె. వాసుదేవరావు, జిల్లా ఒకేషనల్ విద్యాధికారి జే వి ఎస్ ఎస్ సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు, బూరుగుపల్లి శేషారావు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్ బొట్టు గీతాంజలి, సుజాత అధ్యాపకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News