Breaking News

రైతు స్పందనలో పాల్గొనడం సంతృప్తినిచ్చింది… : జిల్లా కలెక్టరు జె.నివాస్


-రైతులనుంచి నేరుగా తెలుసుకున్న సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తాం…
-నేను రైతుపక్షమే.. పంటసాగులో రైతు ఏమాత్రం నష్టపోకూడదు…
-పంట వివరాలు ఇ-క్రాప్లో తప్పనిసరిగా నమోదు చేయించుకోండి…

విజయవాడ/కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు స్పందన ద్వారా రైతులతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు అవకాశం కలిగిందని వారి సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టరు జె. నివాస్ స్పష్టం చేశారు. మండల కేంద్రమైన కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటి ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు జె.నివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతృప్తికరంగా ఉందన్నారు. జిల్లాలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతీ మొదటి, మూడవ బుధవారం రైతుస్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా రైతుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేదిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కంకిపాడులో నిర్వహించిన సమావేశంలో పలువురు రైతులు విత్తనసమస్యను తెలియజేశారని 1318 వరివంగడం బాగుంటుందని వారు తెలియజేయడం జరిగిందన్నారు. అయితే ఆవిత్తనం ఇంకా టెస్టింగ్ లో ఉందని ఆవిత్తనాలు త్వరగా అందుబాటులోకి వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవితనంకు అధిక దిగుబడి, ముంపును తట్టుకునే శక్తి ఉన్నందున దీనిపై రైతులు మొగ్గుచూపుతున్నారన్నారు. ఎలుకల సమస్యను కొంతమంది రైతులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారన్నారు. అయితే ఇందుకు అవసరమైన ఎలుకల నివారణ మందులను త్వరితగతిన సరఫరా చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయితే ఎలుకల నిర్మూలనకు సామూహిక ఎ లుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపడితేనే ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు. దీనిపై వ్యవసాయ శాఖాధికారులు కూడా రైతులకు వివరించారు. ఇ-క్రాప్ నమెదు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. దీనిమూలంగా రైతులకు అన్నివిధాల ప్రయోజనం ఉంటుందన్నారు. ఇ-క్రాప్ నమోదు మూలంగా రూ. 18 కోట్ల రూపాయలు భీమా పరిహారాన్ని రైతులు పొందగలిగారన్న విషయాన్ని కలెక్టరు జె. నివాస్ ఈసందర్భంగా గుర్తు చేశారు. ఇ-క్రాప్ నమోదులో కొంతమంది వేలిముద్రలు పడడం లేదనే విషయాన్ని సమావేశంలో చెప్పిన సమయంలో అందుకు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు. గతంలో కూడా పెన్షన్లు, రేషన్ కార్డుల విషయంలో కూడా వేలిముద్రల సమస్యలుత లెత్తినప్పుడు అందుకు తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలను కలెక్టరు ఈ సందర్భంగా వివరించారు. కొన్ని సమస్యల పరిష్కారానికి కొంత సమయం పట్టవచ్చునని అయితే ఏదో ఒక రోజు పరిష్కారం జరుగుతుందన్నారు.
కంకిపాడు మండల మంతెన గ్రామానికి చెందిన రైతు యు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతు కోరుకునేది 1318 వరిరకం అని ఇది అయితే ముంపుకు, పడిపోకుండా ఉండడంతోపాటు ఎక్కువ దిగుబడి వస్తున్నదని చెప్పారు. 1061 రకం అయితే దుబ్బుబలం తక్కువ అయి ఒరిగిపోతున్నదని ఆయన చెప్పారు. ధాన్యం తూకాల విషయంలో కూడా మోసం జరగకుండా చూడాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టరు జె.నివాస్ స్పందిస్తూ లీగల్ అండ్ మెట్రాలజీ శాఖ ద్వారా కాటాలు తనిఖీ చేయిస్తామని చెప్పారు. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల పరిధిలోనే ధాన్యం కాటా వేసే ఆలోచన చేస్తున్నామన్నారు.
కుందేరు గ్రామానికి చెందిన రాజేష్ అనే కౌలు రైతు మాట్లాడుతూ 1061 వరిరకం సాగుచేసానని 25 బస్తాలుకన్నా ఎక్కువ దిగుబడి రాలేదని, 1318 వరిరకం అన్ని విధాల బాగుందని దీనిని ప్రోత్సహించి సాగుచేసినవారినుంచి ఈధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టరు జె. నివాస్ స్పందిస్తూ ఈవిత్తనం ట్రైయలో మాత్రమే ఉందని, త్వరగా దీనిని తీసుకు వచ్చే అవకాశాన్ని పరిశీలన చేస్తామన్నారు. అదేవిధంగా రాజేష్ మాట్లాడుతూ కౌలు రైతులకు సప్తగిరి వంటి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, రుణాలు ఇప్పించాలని కోరారు. దీనిపై కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే రుణాలు తీసుకున్నవారు రెగ్యులర్ గా చెల్లిస్తే తిరిగి మరింత మందికి రుణాలు అందుతాయన్నారు.
తన్నీరు గ్రామానికి చెందిన కె.యల్లమంద మాట్లాడుతూ ఎలుకల ఇబ్బంది ఎక్కువుగా ఉందని వీటిని నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులు స్పందిస్తూ వారంరోజుల్లో ఇందుకు సంబంధించిన మందు రానున్నదని దీనిని పూర్తిగా ఉచితంగా రైతులకు అందిస్తామన్నారు. సామూహిక ఎలుకల నిర్మూలనకు అవసరమైన శిక్షణ కూడా అందించనున్నట్లు చెప్పారు.
మద్దూరు గ్రామానికి ఒదుగు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ పంటల భీమా క్రింద తమ గ్రామంలో రూ. 96 లక్షలు భీమా అందిందని అయితే ఇంకా 200 మంది రైతులకు రావాల్సిన సొమ్ము అందేలా చూడాలని కోరారు. ఇ-క్రాప్లో నమోదు చేసుకోవడం మూలంగా తమకు ప్రయోజనం చేకూరిందన్నారు.
మండల వ్యవసాయ శాఖాధికారిణి మాట్లాడుతూ కంకిపాడు మండలంలో 18 వేల ఎకరాల సాగుకు గాను ఇంతవరకూ 8 వేల ఎ కరాల్లో పంటనమోదు అయ్యిందన్నారు. 7 వేలమంది రైతులకు గాను ఇంతవరకూ 3200 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ బందరుకాల్వ, రైవస్ కాల్వ ద్వారా మండలంలో సాగునీరు అందుతున్నదని ఖరీఫ్ సాగుకు ఎటువంటి నీటి సమస్య లేదన్నారు.
కార్యక్రమంలో విజయవాడ సబ్ కలెక్టరు బి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, మండల వ్యవసాయ అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ సత్తా వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టరు టి.మోహనరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టరు డా. కె. విద్యాసాగర్ , మత్స్యశాఖ జాయింట్ డైరెక్టరు లాల్ మహ్మద్, ఘంటశాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు కె. నాగేంద్రరావు, మండల ప్రత్యేకాధికారి డా. సాయిగోపాల్, ఇన్‌ఛార్జ్ తహశీల్దారు శ్రీనివాసమూర్తి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టరు సునీల్, హార్టికల్చర్ ఏడి దయాకరబాబు, యంపిడిఓ కె.అనురాధ, ఎలక్ట్రికల్ ఏఇ కె. నారాయణ, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రాంగణంలో జిల్లా కలెక్టరు జె. నివాస్ మొక్కను నాటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *