విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రమశిక్షణతో చదివే విద్యార్థులు భవిష్యత్ లో మంచి అద్భుతాలు సృష్టించగలుతారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం నందు శనివారం జరిగిన శ్రీరామ్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తిని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వీటిలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. చదువుతో పాటుగా విద్యార్థులు క్రీడలలోనూ రాణించాలని ఆకాంక్షించారు. చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే దిశగా అధ్యాపకులు, తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలన్నారు. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువు అని, అటువంటి విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. ‘అమ్మ ఒడి’ పేరిట చదువుకునే పిల్లలున్న తల్లులకు ఈ ప్రభుత్వం ఆర్థిక ఆసరా కల్పిస్తోందన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 38,427 మంది విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని అందించినట్లు వివరించారు. కనుక విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అనంతరం 2020-21 విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్, నాయకులు అఫ్రోజ్, ఆదినారాయణ, మల్లేశ్వరరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News