మిషన్ కర్మయోగి అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామి

-దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు iGOTలో నమోదు.. 2 కోట్లకు పైగా కోర్సుల పూర్తి
-ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాలు, సేవాభావం పెంపొందించడమే లక్ష్యం
-ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని ‘కర్మయోగి’గా తీర్చిదిద్దడమే మిషన్ కర్మయోగి లక్ష్యం
-కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC) ఛైర్‌పర్సన్, భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి (DoPT) ఎస్. రాధా చౌహాన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘సేవాభావం–నాగరిక్ దేవోభవ’ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ఉద్యోగుల భాగస్వామ్యం 900 కు పైగా శిక్షణా సంస్థలను అనుసంధానించే ‘ఉన్నతి’ ప్లాట్‌ఫామ్ అని కేపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC) ఛైర్‌పర్సన్, భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి (DoPT) ఎస్. రాధా చౌహాన్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమం కింద రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న తొలి ప్రాంతీయ వర్క్‌షాప్ ‘సాధన శృంఖల’ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC) ఛైర్‌పర్సన్, భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి (DoPT) శ్రీమతి ఎస్. రాధా చౌహాన్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నాలుగు ప్రాంతీయ వర్క్‌షాప్‌లలో తొలి వర్క్‌షాప్‌ ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించడం పట్ల కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC) ఛైర్‌పర్సన్, భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి (DoPT) శ్రీమతి ఎస్. రాధా చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ కర్మయోగి లక్ష్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ అందించడం కాదని, ప్రతి ఉద్యోగిని సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి ‘సేవాభావం’, ‘నాగరిక్ దేవోభవ’ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే నిజమైన ‘కర్మయోగి’ గా తీర్చిదిద్దడమేనన్నారు.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రవర్తనా మార్పు, కార్యాచరణ నైపుణ్యాలు, నిరంతర అభ్యాసం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించడంలో శిక్షణా సంస్థల పాత్ర మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని రాధా చౌహాన్ తెలిపారు. శిక్షణా సంస్థలు కేవలం సంప్రదాయ పద్ధతుల్లో శిక్షణ అందించే సంస్థలుగా కాకుండా, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా సమగ్ర సామర్థ్య నిర్మాణ సంస్థలుగా రూపాంతరం చెందాలని సూచించారు. ఈ దిశగా దేశవ్యాప్తంగా 900 కు పైగా శిక్షణా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ‘ఉన్నతి’ ప్లాట్‌ఫామ్, iGOT మరియు హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలతో అనుసంధానమై పనిచేస్తుందని వివరించారు. దీని ద్వారా శిక్షణా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల మధ్య మరింత సమర్థవంతమైన సమన్వయం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుతం కేవలం 8 నుంచి 10 శాతం మంది అధికారులు, ఉద్యోగులకు మాత్రమే అందుతున్న సంస్థాగత శిక్షణను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి స్థాయి ప్రభుత్వ ఉద్యోగికి అవసరమైన శిక్షణ, నైపుణ్యాలు అందించడం ద్వారా పరిపాలనా సామర్థ్యాన్ని పెంచవచ్చని తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వ సేవల నాణ్యత పెరగడంతో పాటు దేశ ఆర్థిక వృద్ధికి కూడా ఊతం లభిస్తుందని ఆమె అన్నారు. సమర్థవంతమైన, నైపుణ్యవంతమైన మానవ వనరులను తయారు చేయడం ద్వారా భారతదేశ ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించవచ్చని రాధా చౌహాన్ పిలుపునిచ్చారు. రెండు రోజుల ‘సాధన శృంఖల’ వర్క్‌షాప్ ద్వారా వివిధ రాష్ట్రాలు, శిక్షణా సంస్థలు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్య నిర్మాణానికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు ఆమె తెలిపారు.

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రంలో మిషన్ కర్మయోగి అమలు కొంత ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం దేశంలోనే ముందంజలో నిలిచిందన్నారు. దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బందిని iGOTలోకి తీసుకురావడంతో పాటు 2 కోట్లకు పైగా కోర్సుల నమోదు సాధించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్‌వాడీలు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఉపయోగపడేలా తెలుగు భాషలో శిక్షణా కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతలను అనుసంధానం చేసి ఉద్యోగుల పనితీరు, శిక్షణ ఫలితాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.

సింగపూర్ ప్రభుత్వం, నీతి ఆయోగ్‌తో కలిసి పాలనా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తూ ‘స్వర్ణాంధ్ర-2047’, ‘వికసిత్ భారత్’ లక్ష్యాలను సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని  పియూష్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC) సభ్యురాలు శ్రీమతి అల్కా మిట్టల్ మాట్లాడుతూ.. మిషన్ కర్మయోగి అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రశంసించారు. 2024 అక్టోబర్‌లో భాగస్వామ్యం కుదిరిన అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపుదల ప్రక్రియ వేగవంతమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 7.9 లక్షల మంది ఉద్యోగులు iGOT ప్లాట్‌ఫామ్‌లో చేరగా, 5 లక్షలకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగులు ఇప్పటివరకు 2 కోట్లకు పైగా కోర్సులను విజయవంతంగా పూర్తి చేశారని, 38 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్లు కూడా iGOTలో అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. శిక్షణా సంస్థలు కేవలం సంప్రదాయ శిక్షణకు పరిమితం కాకుండా ప్రభుత్వ అవసరాలు, ఉద్యోగుల నైపుణ్యాలకు అనుగుణంగా సమగ్ర సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా రూపాంతరం చెందాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల వర్క్‌షాప్‌లో జరిగే చర్చలు దేశవ్యాప్తంగా శిక్షణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు, తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గడ్డపార చేతబట్టి… డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…

-కొకులవారిపల్లి గ్రామంలో శ్రమదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -శ్రమదానంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *