మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

-సంక్షేమానికి-సంక్షోభానికి వ్యత్యాసం చూడండి… మంచికి అండగా నిలవండి
-ప్రధాని మోదీ సహకారం… నా అనుభవం… పవన్‌ హుషారుతో రాష్ట్రాభివృద్ధి
-నాడు వందల కిలో మీటర్లు… నేడు వేల కిలో మీటర్లలో సీసీ రోడ్ల నిర్మాణం
-2024 కంటే కూటమికి ఆదరణ పెరిగింది… స్థానిక ఎన్నికల్లోనూ కూటమిదే హవా
-ఉదయగిరి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఉదయగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం పేదలకు పట్టాభిషేకం చేస్తుంటే.. మరోవైపు కొందరు విధ్వంసంతో రక్తాభిషేకం చేస్తామంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి విధ్వంసానికి, నేటి వికాసానికి.. నాటి సంక్షోభానికి, నేటి సంక్షేమానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. రాజకీయాలను నేరమయం చేసేవారెవరో, రాజకీయాలతో ప్రజల జీవితాలను మార్చేవారెవరో ప్రజలు గమనించాలని అన్నారు. అభివృద్ధికి అడ్డొస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని, మంచికి మద్దతుగా నిలవాలని సీఎం చంద్రబాబు కోరారు. పల్లె పండుగ-3.0 కార్యక్రమం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటంపాడు మండలం, రామాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో గత ప్రభుత్వ తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టారు. ఓటమి చెందిన తర్వాత కూడా వైసీపీ చేస్తున్న విధ్వంసాన్ని… కుట్రలను సభికులకు వివరించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించడంతోపాటు… వాళ్ల కుట్రలను కూడా గమనించాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… 2024 ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడి ప్రధాని నరేంద్ర మోదీ, తాను, పవన్‌ కళ్యాణ్‌ ప్రజల ముందుకు వచ్చామని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. ప్రజలు ఎన్నడూ ఇవ్వనంత మెజార్టీని 2024 ఎన్నికల్లో కూటమికి అందించారని, 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో చరిత్ర సృష్టించారని తెలిపారు. నాడు ప్రజలు అద్భుతమైన గెలుపును అందిస్తూ చేసిన విజయధ్వానాలు ఇప్పటికీ తమ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని అన్నారు. 2024 ఎన్నికల నాటి కంటే ఇప్పుడు ఎన్డీఏ హవా మరింత పెరిగిందని చంద్రబాబు అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రధాని మోదీ అందిస్తున్న కేంద్ర సహకారంతో తన అనుభవం, పవన్‌ కళ్యాణ్‌ హుషారుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

నాడు పల్లెలు కన్నీళ్లు పెట్టుకున్నాయి…

గత ప్రభుత్వం చేసిన విధ్వంసంతో నాడు పల్లెలు కన్నీళ్లు పెట్టుకున్నాయని సీఎం విమర్శించారు. నాడు ఎక్కడ చూసినా గుంతలు, వీధి దీపాల కొరత, కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌ వేసేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఉండేదన్నారు. ఆ దుస్థితి నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పల్లెలను అభివృద్ధి బాట పట్టించారని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే వేస్తే.. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే 6,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించి చరిత్ర సృష్టించిందని తెలిపారు. నాడు ఖర్చు చేసిన డబ్బులు ప్రజలకు కనిపించలేదని, నేడు కళ్లకు కనిపించేలా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని వారసత్వంగా స్వీకరించామని, ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని చంద్రబాబు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేసి సూపర్‌హిట్‌ చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం వల్ల రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామని, వెంటిలేటర్‌పై ఉన్న ఏపీని ప్రధాని మోదీ ఆదుకున్నారని చెప్పారు. గత పాలకులు దెబ్బతీసిన ఏపీ బ్రాండ్‌ను తిరిగి పునరుద్ధరించామని చంద్రబాబు అన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. కొత్త పాలసీలు, సంస్కరణలు తీసుకొచ్చి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని తెలిపారు.

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని చంద్రబాబు అన్నారు. రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉండగానే వెలిగొండ ప్రాజెక్టుకు రిబ్బన్‌ కట్‌ చేశారని విమర్శించారు. వెలిగొండ ఫేజ్‌-2ను కూడా పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గానికి నీళ్లు అందిస్తామని, మార్కాపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రజల జీవితాలను మార్చే పాలనకు, రాజకీయాలను నేరమయం చేసే విధానాలకు మధ్య తేడాను గమనించాలని కోరారు. పేదరికం లేని గ్రామాలను తీర్చిదిద్దడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని… ఇక్కడుండేది నరేంద్ర మోదీ, సీబీఎన్, పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధికి అడ్డొస్తే ఎంత మాత్రం ఉపేక్షించమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్దికి చోదకశక్తి

-టెక్నాలజీతో పాలనా విధానాలు మరింత సరళీకృతం -పౌరసేవల్లో నాణ్యతే సామర్ధ్యాల పెరుగుదలకు గీటురాయి -మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *