పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

-ప్రజలు వేసిన ఓటు వృధా కాలేదు… నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన
-దూసుకెళ్తున్న డబులింజన్ పాలన… జెట్ స్పీడ్ వేగంతో అభివృద్ధి
-గ్రామాభివృద్ధిలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు
-ఉదయగిరి పల్లె పండుగ-3.0 బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
-పల్లె పండుగ-3.0లో భాగంగా రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం
వీబీ జీ రాంజీ శ్రామికుల వద్దకెళ్లి శ్రమదానం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఉదయగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, తాము ప్రజలకు సేవకులమే తప్ప పెత్తందార్లం కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటంపాడు మండలం, రామాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో కలిసి రూ.11,085 కోట్ల విలువైన గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పల్లె పండుగ-3.0లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,700 కోట్లతో 6 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనం చేశారు. అలాగే పాడి రైతుల కోసం రూ.300 కోట్లతో 22 వేల మినీ గోకులాలు నిర్మాణం, రూ.225 కోట్లతో 50 వేల ఎకరాల్లో ఉద్యాన తోటల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రూ.110 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల మేర మ్యాజిక్‌ డ్రెయిన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పల్లె పండుగ ద్వారా నాందీ పలుకుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్ వేస్తున్నామని… రోడ్ల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని… ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని… పల్లెల్లోనూ కనివినీ రీతిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. ప్రజల కళ్లకు కనబడేలా అభివృద్ధి చేస్తున్నామని… గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి పెట్టామన్నారు. గోకులం షెడ్లు, మ్యాజిక్ డ్రైన్లను నిర్మిస్తున్నామని… ప్రతి ఒక్కరికీ ఇల్లు.. ఇంటి స్థలం, విద్యుత్, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రకు గ్రామాలే నాందీ పలకాలని సూచించారు. చెత్త నుంచి సంపద సృష్టించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని… పేదరికం లేని గ్రామాలను తీర్చిదిద్దేందుకు.. ఆర్థిక అసమానతలు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

పల్లె వికాసంలో పవన్ చొరవ అభినందనీయం

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో ఇప్పటికే మూడు పల్లె పండుగ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో పవన్‌ కళ్యాణ్‌ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని, పల్లె వికాసంలో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అభినందించారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా పవన్‌ అనేక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. రెండున్నర దశాబ్దాల తర్వాత పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని వివిధ హోదాల్లో ఉన్న 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4,136 కోట్లు విడుదల చేశామని చెప్పారు. లక్షకు పైగా పంటకుంటలు తవ్వించడంతో పాటు పశువుల కోసం నీటి తొట్టెలు నిర్మించామని వివరించారు. పవన్‌ నేతృత్వంలోని పంచాయతీరాజ్‌ శాఖకు 13 జాతీయ అవార్డులు రావడం అభినందనీయమన్నారు. 2024 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి తాను, పవన్ కళ్యాణ్ ప్రజలకు వద్దకు వచ్చి రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నాడు హామీ ఇచ్చిన విధంగానే రాష్ట్రాన్ని నడిపిస్తున్నామన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు వృథా కాలేదని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. చెప్పిన విధంగానే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని, జెట్‌ స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనే ఎన్డీఏ ప్రభుత్వ మంత్రమని పేర్కొన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, సామాజిక పింఛన్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. పేదలకు రూ.5కే అన్నం అందించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిలిపివేసిందని, తాము తిరిగి అమలు చేస్తున్నామని చెప్పారు. మత్స్యకారులు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని, ఆమూల్‌ బ్రాండ్‌ స్థాయిలో స్వయం బ్రాండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. 30 ఏళ్ల క్రితం తానే శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించానని చెప్పారు. వెలిగొండ ఫేజ్-2 పనులను కూడా పూర్తి చేసి.. ఉదయగిరి నియోజకవర్గాన్ని.. మార్కాపురం జిల్లాను సస్య శ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హంద్రీ-నీవా ద్వారా రాయలసీమ చివరి భూములకు నీరందిస్తున్నామని, పోలవరం ఎడమ కాల్వ ద్వారా అనకాపల్లి ప్రాంతానికి నీటిని తీసుకెళ్తున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య, ఉద్యాన పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.

మరింత సంక్షేమం… మరింత అభివృద్ధి

విశాఖలో 28 వేల మందికి పైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించామని, విజయవాడలో మరో 24 వేల మందికి పట్టాలు అందించనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో మూడు లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నామని చెప్పారు. రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పొట్టి శ్రీరాములు జలధార పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వ సహాకారంతో జల్ జీవన్ పనులను భారీ ఎత్తున ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేలా వివిధ రంగాల్లో పరిశ్రమలను తీసుకొస్తూ ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. కృష్ణపట్నం-రామాయపట్నం పోర్టుల మధ్య దగదర్తి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రైల్-రోడ్ కనెక్టివిటిని పెంచి నెల్లూరు-ప్రకాశం జిల్లాలను లాజిస్టిక్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. బీపీసీఎల్‌ ప్లాంట్‌ ద్వారా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయని, డిఫెన్స్‌ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నాయని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన నెల్లూరు, ఉదయగిరి ప్రాంతవాసులు తిరిగి ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించే బాధ్యత తమదని, అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలదని అన్నారు. తమ అభివృద్ధిని చూసి సహకరించాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదైతే.. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రజలదని సీఎం చెప్పారు.

ఉదయగిరి సభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు…

పల్లె పండుగ-3.0 కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక ప్రకటనలు చేశారు. పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్‌ కాల్వ పనులకు రూ.52 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ఫేజ్‌-1 నిర్మాణానికి అవసరమైన రూ.85 కోట్లు అందిస్తామని తెలిపారు. డిఫెన్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌కు అవసరమైన క్లియరెన్సులు మంజూరు చేస్తామని, సీబీజీ ప్లాంట్‌కు నిరంతర విద్యుత్‌ సరఫరాకు సహకరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సోమశిల డ్యామ్‌ భద్రతకు అవసరమైన నిధులు సమకూరుస్తామని వెల్లడించారు. క్రాకటూరు డిస్ట్రిబ్యూటరీకి నిధులను సమకూర్చడంతోపాటు… వింజమూరు ప్రాంత పరిధిలో తాగు, సాగునీటి అవసరాల కోసం రాజవోలు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. కనిగిరి ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి.. బీటే రోడ్ల పునర్నిర్మాణానికి వీబీజీ రామ్‌జీ గ్రాంట్‌ అందిస్తామని చెప్పారు. కనిగిరిలోని 189 ఫ్లోరైడ్‌ ప్రభావిత గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాళ్లపాడు రిజర్వాయర్‌ ద్వారా ఓలేటివారిపాలెం, గూడూరు, లింగసముద్రం మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కనిగిరి-బల్లిపల్లె వద్ద ట్రిపుల్‌ఐటీ ఏర్పాటుకు సహకరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం కాకొల్లువారిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శ్రమదానం చేశారు. ‘వీబీ జీ రాంజీ’ శ్రామికుల వద్దకు వెళ్లి పొలాల మధ్య డొంక రోడ్డు పనులను ప్రారంభించారు. కాలినడకన పల్లెపండుగ అభివృద్ధి పనుల పరిశీలనించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ‘వీబీ జీ రాంజీ’ శ్రామికులతో కలసి సీఎం, డిప్యూటీ సీఎం, మాధవ్ గ్రూప్ ఫొటో దిగారు.

ఆసక్తిగా ర్యాంప్ వాక్… ఆకట్టుకున్న ఏర్పాట్లు…

సీఎం, డిప్యూటీ సీఎంలు సభా వేదిక మీదకు రాగానే సభికుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. తమ మెళ్లో వేసుకున్న కండువాలను గాల్లో ఊపుతూ సభికులు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని చూసి పలువురు మహిళలు ఆనందంతో డ్యాన్సులు చేశారు. ర్యాంప్ వాక్ చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలను ఫొటోలు తీసేందుకు పలువురు సభికులు ప్రయత్నించారు. తమ కుర్చీల్లో నుంచి లేచి ఫోన్లల్లో ఫొటోలు తీసుకున్నారు. ఇక పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు. మామిడి తోరణాలు, రంగవల్లులతో అతిధులకు, ప్రజలకు స్వాగత ఏర్పాట్లు చేశారు. సభ అనంతరం కాకొల్లువారిపాలెం గ్రామంలో పల్లె పండుగ-3.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పరిశీలించారు. గ్రామస్థులు వారికి పూలు జల్లి ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం.. గ్రామస్థులతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్దికి చోదకశక్తి

-టెక్నాలజీతో పాలనా విధానాలు మరింత సరళీకృతం -పౌరసేవల్లో నాణ్యతే సామర్ధ్యాల పెరుగుదలకు గీటురాయి -మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *