-కొకులవారిపల్లి గ్రామంలో శ్రమదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-శ్రమదానంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్
-వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి పొలాల మధ్యకు డొంక రోడ్డుకు శ్రీకారం
-కాలినడకన పల్లెపండుగ అభివృద్ధి పనుల పరిశీలన
-పూల జల్లులతో స్వాగతించిన గ్రామస్తులు
-కొత్త రోడ్లపై గ్రామంలోకి నడిచి వెళ్లిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్
-గ్రామ సచివాలయం వద్ద వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గడ్డపారలు చేత పట్టి వీబీ జీ రాంజీ పనులను ప్రారంభించారు. కొత్త డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొకులవారిపల్లి గ్రామంలో పొలాల మధ్యకు నిర్మించతలపెట్టిన డొంక రోడ్డుకు శ్రమదానం చేశారు. గడ్డపారలతో ముగ్గురు నేతలు మట్టిని తవ్వగా, ఆ
గ్రామానికి చెందిన వీబీ జీ రాంజీ శ్రామికులు గంపలతో మట్టిని ఎత్తి రోడ్డు పోశారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో డొంక రోడ్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాలు ఉన్న 167 నియోజకవర్గాల పరిధిలో నియోజక వర్గానికి ఒక్కటి చొప్పున డొంక రోడ్డు నిర్మించనుండగా, ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో కొకులవారిపల్లి గ్రామంలో నిర్మించతలపెట్టిన డొంక రోడ్డు పనులను శ్రమదానం ద్వారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.
అంతకు ముందు కొకులవారిపల్లి గ్రామంలో పల్లెపండుగ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ముగ్గురు నేతలు కాలినడకన పరిశీలించారు. గ్రామ సరిహద్దుల్లో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టె స్వాగతం పలుకగా, గ్రామంలోకి వేసిన బీటీ రోడ్డు, గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, రోడ్డుకి సమీపంలో ఉన్న మినీ గోకులాన్ని పరిశీలించారు. రోడ్డు నాణ్యతను తనిఖీ చేశారు. సుమారు కిలోమీటరు మేర కాలినడకన కొకులవారిపల్లి గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో దిగారు.
అంతకు ముందు తమ గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పీవీఎన్ మాధవ్ కు కొకులవారిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గ్రామ సరిహద్దుల నుంచి పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలతో ముచ్చటిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముగ్గురు నేతలు గ్రామంలోకి నడిచి వెళ్లారు.
వేదికపై నడుస్తూ చేస్తూ.. ప్రజలకు అభివాదం
అంతకు ముందు పల్లెపండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సభా వేదికపైకి విచ్చేసిన ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులకు ప్రజలు అద్భుత స్వాగతం పలికారు. తమ మెడల్లోని కండువాలు గాల్లో ఊపుతూ, జయజయధ్వానాలు పలుకుతూ నేతలను స్వాగతించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. తమ అభిమాన నేతల్ని చూసి మహిళలు సైతం ఆనందంతో చిందులు వేశారు. ఫోన్లలో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. వేదికపై పల్లెపండుగ కార్యక్రమానికి పూర్వం గ్రామాల్లో పరిస్థితులు, పల్లెపండుగ తర్వాత అభివృద్ధిని వివరిస్తూ చేసిన వీడియో ప్రజెంటేషన్ సభికుల్ని ఆకట్టుకుంది.
పవన్ కళ్యాణ్ పై అభిమానం చాటుకున్న ఉదయగిరి ప్రజలు
పల్లెపండుగ 3.0కి తమ నియోజకవర్గాన్ని ఎంపిక చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్
కళ్యాణ్ పై ఉదయగిరి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన జెండా
రంగులతో కూడిన గొడుగులతో వెల్కమ్ టూ పవన్ కళ్యాణ్ సర్ అంటూ.. ఆంగ్ల అక్షరమాలిక
రూపాన నిలబడి కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News