Breaking News

వేట నిలిచినా.. మత్స్యకార కుటుంబాలకు భరోసా

– తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
– ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బాధిత కుటుంబాలకు చేయూత
– బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో వేటే జీవనాధారంగా ఉన్న మత్స్యకారులు ప్రతికూల వాతావరణంతో ఉపాధికి దూరమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆయా కుటుంబాల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఉచిత బియ్యం అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఆపద సమయంలో బాధితులకు సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు. బియ్యం పంపిణీకి సంబంధించి జిల్లాల యంత్రాంగానికి అవసరమైన ఆదేశాలు ఇచ్చామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో అర్హులైన మత్స్యకార కుటుంబాలన్నింటికీ ఈ సహాయం అందుతుందని స్పష్టం చేశారు. వేట నిలిచిపోయిన వేళ వారి కుటుంబాల ఆహార అవసరాలకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మత్స్యకారుల ప్రాణ రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతికూల పరిస్థితుల్లో వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పారాదీప్‌కు సురక్షితంగా చేరిన కాకినాడ మత్స్యకారుల పడవ

కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్‌ పడవ శనివారం ఉదయం ఒడిశాలోని పారాదీప్‌కు సురక్షితంగా చేరుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పడవలో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మత్స్యకారులు తమ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జాతీయ స్థాయిలో ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖకు అరుదైన గౌరవం..

-‘స్కోచ్ సిల్వర్ పురస్కారం’ దక్కించుకున్న ఐ&పీఆర్ శాఖ -ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు గోల్డ్ స్కోచ్ అవార్డు -మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *