-మేం కూడా యథాతథంగా మా రాష్ట్రంలో అమలు చేస్తం
-ఆసక్తి ప్రదర్శించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం
-ఏపీ వాణిజ్య పన్నుల శాఖకు ప్రశంసలు
-ఛత్తీస్‌గఢ్‌కు సాంకేతిక సహకారం అందించాలని విజ్ఞప్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జీఎస్టీ అమలును సమర్థవంతంగా నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ అమలు చేస్తున్న కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ఆధారిత ఎండ్ టు ఎండ్ ట్యాక్స్ సొల్యూషన్స్ విధానం దేశంలోని పలు రాష్ట్రాలను ఆకట్టుకుంటోంది. ఈ విధానాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి ఆయా రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు చెందిన పన్నుల శాఖ ప్రతినిధుల బృందం ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ విధానాన్ని అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కూడా తమ రాష్ట్రంలో ఏపీ మోడల్‌ను అమలు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తోంది. దీనికోసం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పన్నుల శాఖకు చెందిన ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నల శాఖను సందర్శించి ఆ శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ మోడల్‌ను అధ్యయనం చేసింది. ఛత్తీస్‌గఢ్ ఐఆర్‌ఎస్ ప్రత్యేక కమిషనర్ తరన్నుమ్ వర్మ నేతృత్వంలో జాయింట్ కమిషనర్ నరేంద్ర వర్మ, డిప్యూటీ కమిషనర్లు హేమంత్ సిన్హా, ప్రకాశ్ గుప్టే, అసిస్టెంట్ కమిషనర్ పూర్వ గుప్తీ, సిస్టమ్ అనలిస్ట్ రిధిమా శర్మ లతో కూడిన ప్రత్యేక బృందం మూడు రోజుల పాటు ఏపీలో అధ్యయనం చేసింది. ఈ బృందానికి రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ చీఫ్ కమీషనర్ బాబు ఏ సాదర స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ ప్రత్యేకతల గురించి వారికి వివరించారు. మూడు రోజుల పాటు ఈ బృందం ఐటీ, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, లీగల్ ఏఐ, కేస్ మేనేజ్మెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్, పన్ను ఎగవేతల నిరోధక వ్యవస్థ, ఆదాయ వృద్ధి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, సాంకేతికత ఆధారిత క్షేత్రస్థాయి కార్యకలాపాల వంటి అంశాలపై చర్చలు జరపడంతో పాటు వాటిని అధ్యయనం చేశారు.
తొలిరోజు ఐటీ, డీఏసీ విభాగంలో వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఐటీ, డేటా అనలిటిక్స్, ఏఐ కార్యక్రమాలపై ఛత్తీస్‌గఢ్ ప్రతినిధి బృందానికి అవగాహన కల్పించారు. లీగల్ విభాగంలో ఆధ్వర్యంలో కేస్ మేనేజ్మెంట్, లిటిగేషన్ ట్రాకింగ్ న్యాయపరమైన కేసుల నిర్వహణలో ఏఐ వినయోగంపై సోదాహరణంగా వివరించారు. రెండవ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్, పన్ను ఎగవేత నిరోధక చర్యలు, ఆదాయ ధోరణులు, ఆదాయ వృద్ధి వ్యూహాలు, సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ (సీఆర్‌యూ) పనితీరుపై ప్రతినిధి బృందానికి వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు, వాహనాల తనిఖీల కోసం రూపొందించిన మొబైల్ అప్లికేషన్లను, వాటి పనితీరు గురించి వివరించారు.
ఏపీ వాణజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు ఏ మాట్లాడుతూ జీఎస్టీ చట్టం అమలులో కృత్రిమ మేథ వినియోగిస్తున్న విధానంపై సమగ్రంగా ఛత్తీస్ గఢ్ ప్రతినిధి బృందానికి వివరించారు. చట్టబద్ధమైన పన్నుల నిర్వహణ ప్రక్రియలో ఏఐ, అధునాతన డేటా అనలిటిక్స్‌ను అనుసంధానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. డేటాను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా అది క్షేత్రస్థాయిలో అధికారులకు సహకరించడమే కాకుండా నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి, పన్ను ఎగవేతలను నిరోధించడానికి కూడా ఏఐ ఎంతో ఉపయోగడపడుతుందని ఆయన వివరించారు. చట్టబద్ధమైన నిర్ణయాలను మాత్రం సంబంధిత అధికారులే తీసుకుంటారని స్పష్టం చేశారు.
జీఎస్టీ విచారణలో ఎండ్ టు ఎండ్ ఏఐ ఆధారిత పరిష్కారం
జీఎస్టీ కేసుల విచారణకు సంబంధించి ఏపీ వాణిజ్యపన్నుల శాఖ రూపొందించిన ఎండ్ టు ఎండ్ ఏఐ ఆధారిత పరిష్కారం ఛత్తీస్‌గడ్ బృందాన్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ప్రమాదకరమైన, క్లిష్టతరమైన పన్ను చెల్లింపుదారులను గుర్తించడానికి రిస్క్ పొఫైలింగ్, కేసుల ఎంపిక, కేసుల కేటాయింపు, డేటాలో వ్యత్యాసాలు, అనుమానాస్పద లావాదేవీల నమూనాలను గుర్తించడం, విచారణ విశ్లేషణతోపాటు జీఎస్టీ చట్టం, నిర్దేశిత విధానాలకు అనుగుణంగా చట్టబద్దమైన నోటీసులు, సమాచార పత్రాలు, ఉత్తర్వుల ముసాయిదాలను రూపకల్పన వరకు సమస్తం ఈ ఏఐ సహకారంతో నిర్వహిస్తున్నామని బాబు ఏ వివరించారు. ఏఐని కేవలం డేటా విశ్లేషన సాధనంగా కాకుండా, జీఎస్టీ పరిపాలనా ప్రక్రియ మొత్తంలో సమగ్ర నిర్ణయ సహాయక వ్యవస్థగా వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. పన్ను చెల్లింపుదారుల సమాచారం, రిస్క్ సూచికలు, గుర్తించిన వ్యత్యాసాలు, చట్టబద్ధమైన నిబంధనలను ఒకే వ్యవస్థలో అనుసంధానం చేయడం ద్వారా కేసుల ఎంపిక నుంచి దర్యాప్తు విశ్లేషణ, సంబంధిత దశల్లో అవసనరమైన చట్టబద్ధ పత్రాల ముసాయిదాల తయారీ వరకు అధికారులకు ఈ వ్యవస్థ సహాయపడుతుందని, తుది పరిశీలన, ఆమోదం మాత్రం సంబంధిత సమర్థ అధికారి ద్వారానే జరుగుతుందని వివరించారు.
ఏపీ మోడల్ మేం కూడా అమలు చేస్తాం
జీఎస్టీ నిర్వహణలో ఏఐని ఎండ్ టు ఎండ్ విధానంగా ఏపీ అమలు చేస్తున్న తీరును, రిస్క్ ఆధారిత కేసుల ఎంపిక, దర్యాప్తు, ముసాయిదాల తయారీ వంటి అంశలను ఒకే సమగ్ర విధానంలో అనుసంధానం చేసి అమలు చేస్తున్న తీరును ఛత్తీస్‌గఢ్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. పన్నుల నిర్వహణలో ఏఐ వినియోగంవల్ల కలిగే ప్రస్తుత ప్రయోజనాలు, బవిష్యత్తు అవకాశాలపై రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు విస్తృతంగా చర్చించి అభిప్రాయలను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్యపన్నుల శాఖ అభివృద్ధి చేసిన ఏఐ ట్యాక్స్ సొల్యూషన్స్‌ను తమ రాష్ట్రంలో యథాతథంగా అమలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని ఛత్తీస్‌గఢ్ ప్రతినిధి బృంధం తెలిపింది. దీనికి కావాల్సిన శిక్షణ, సామర్థ్య నిర్మాణంలో ఏపీ సహాకారం కావాలని కోరింది.
Prajavartha Online Telugu News