Breaking News

రాయలసీమకు ఉద్యాన సిరులు.. రైతన్నకు ఆదాయ భరోసా

– రూ.లక్ష కోట్ల సమగ్ర పెట్టుబడుల ప్రణాళికతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’
– 10 జిల్లాల్లో 201 క్లస్టర్లు.. 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం లక్ష్యం
– అక్టోబర్ 2న మదనపల్లెలో ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా ఐహెచ్‌డీపీ ప్రారంభం
– సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు
– కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి ప్రజలను భాగస్వాములను చేయాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్ది, రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రైజింగ్ రాయలసీమ’ కార్యక్రమాన్ని ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహించే ప్రత్యేక ప్రజా అవగాహన కార్యక్రమాలను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులకు ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రయోజనాలను వివరించాలని ఆదేశించారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మదనపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రాజెక్టు (ఐహెచ్‌డీపీ) ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు. ప్రధాన కార్యక్రమంతోపాటు 201 క్లస్టర్లలో ఏకకాలంలో మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే)లో ప్రత్యక్ష ప్రసారం, జిల్లా కేంద్రాల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసిన ఒక మహిళా రైతు తన జిల్లా ఉద్యాన పంటలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన పండ్ల బుట్టను ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఉద్యాన రంగాన్ని కీలకంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు ఐహెచ్‌డీపీ కార్యరూపమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలతోపాటు ప్రకాశం, మార్కాపురం కలిపి మొత్తం 10 జిల్లాల్లో 201 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. తక్కువ నీటితో అధిక విలువ కలిగిన పంటల సాగు, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యం, సూక్ష్మ సేద్యం విస్తరణ, రైతులకు మెరుగైన ధరలు కల్పించడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలని చెప్పారు. నీటి వనరుల నుంచి ఎగుమతుల వరకు అన్ని వ్యవస్థలను ఒకే సమగ్ర ప్రణాళికలో అనుసంధానం చేస్తూ సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను సమీకరించేలా ప్రాజెక్టును రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో ప్రభుత్వ పెట్టుబడి సుమారు రూ.40,352 కోట్లు కాగా, సాగునీటి రంగానికి రూ.20,884 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.4,562 కోట్లు వెచ్చించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రాసెసింగ్, శీతల గొలుసు వ్యవస్థలు, ప్యాకేజింగ్, రవాణా, సరకు నిర్వహణ రంగాల్లో మరో రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తోటలను మార్కెట్లతో అనుసంధానం చేసి, పంటలకు విలువ జోడించడం ద్వారా రైతులకు మరింత ఆదాయం సమకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆగస్టు 2026 నుంచి జూలై 2029 వరకు మూడు దశల్లో ప్రాజెక్టును అమలు చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. 2026–27లో త్వరితగతిన పూర్తయ్యే పనులు, వెలిగొండ మొదటి దశ, నల్లమలసాగర్‌లో నీటి నిల్వతో 72 క్లస్టర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2027–28లో ఎత్తిపోతల పథకాలు, కాలువలు, జలాశయాల అనుసంధానం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో మొదటి దశ సహా మొత్తం 139 క్లస్టర్లకు అభివృద్ధిని విస్తరించనున్నట్లు తెలిపారు. 2028–29లో మిగిలిన పనులను పూర్తి చేసి, ఎగుమతులకు ప్రాధాన్యమిస్తూ మొత్తం 201 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

జూలై 2029 నాటికి సుమారు 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించడం, 4.3 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం, 540కి పైగా చిన్న నీటి చెరువులను పునరుద్ధరించడం లక్ష్యాలుగా నిర్దేశించుకున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే 6.5 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం, 5,721 కిలోమీటర్ల పక్కా గ్రామీణ రహదారులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 8.41 లక్షల హెక్టార్ల నుంచి 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లకు, ఉత్పత్తిని 222 లక్షల టన్నుల నుంచి సుమారు 435 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా చిన్న రైతులను సైతం పెద్ద మార్కెట్లతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలగడంతోపాటు 19.7 లక్షల ప్రత్యక్ష, 29.6 లక్షల పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉత్పాదకతను 15–20 శాతం పెంచడం, నాణ్యత మెరుగుదల ద్వారా రైతులకు 20–25 శాతం అదనపు ధర లభించేలా చేయడం, ఏటా 40–45 లక్షల టన్నుల కోత అనంతర నష్టాలను తగ్గించడం ప్రాజెక్టు లక్ష్యాలని వివరించారు. మూడో సంవత్సరం నుంచి ఏటా సుమారు రూ.81 వేల కోట్ల అదనపు ఆర్థిక విలువ సృష్టించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రతి రైతుకు తెలిసేలా ప్రజా అవగాహన కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కలెక్టర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 26న జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహించే ముందస్తు మీడియా సమావేశాల్లో ఆయా జిల్లాల్లోని క్లస్టర్లు, విస్తీర్ణం, ప్రయోజనం పొందే రైతుల వివరాలను వెల్లడించాలని సూచించారు. సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు వ్యవసాయ, ఉద్యానవన, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు ‘హార్ట్‌–టెక్ ఛాలెంజ్ అండ్ క్విజ్’ నిర్వహించి, కోత అనంతర నిర్వహణ, శీతల గొలుసు వ్యవస్థలు, ఉత్పత్తి మూలాలను గుర్తించే సాంకేతికత, ఎగుమతులపై వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాలన్నారు.

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు మొత్తం 201 క్లస్టర్లలో ప్రచార రథాలు, కళాజాతాలు, బుర్రకథల ద్వారా ప్రాజెక్టు లక్ష్యాలను ప్రజలకు వివరించాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు పాఠశాలల్లో ‘నా జిల్లా–నా పంట’, ‘పంటను గుర్తించండి’, ‘ఒక మొక్క భవిష్యత్తు కోసం’ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆయా జిల్లాలకు సంబంధించిన పంట మొక్కలను అందించి నాటించాలన్నారు. సెప్టెంబర్ 29న అన్ని క్లస్టర్లలో ‘తోట పాఠశాల’ నిర్వహించి సూక్ష్మ సేద్యం, వ్యవసాయ కుంటలు, కలుపును నియంత్రించే వీడ్ మ్యాట్స్ వంటి ఆధునిక పద్ధతులపై రైతులకు క్షేత్రస్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సెప్టెంబర్ 30న పది జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్ ర్యాలీలు, అక్టోబర్ 1న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో పూలు, పండ్లు, కూరగాయలు, విత్తనాల ఇతివృత్తాలతో ముగ్గుల పోటీలు నిర్వహించాలని మంత్రి సూచించారు. అక్టోబర్ 2 ప్రధాన కార్యక్రమంలో రైతులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా సమన్వయం చేయాలన్నారు. అక్టోబర్ 3 నుంచి 5 వరకు ప్రారంభోత్సవ విశేషాలు, రైతుల భాగస్వామ్యం, విజయగాథలను డిజిటల్ మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రధాన సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ ఉద్యానవన, వ్యవసాయ, పాఠశాల, కళాశాల విద్యాశాఖలు, డీఆర్‌డీఏ, మెప్మా, సమాచార పౌరసంబంధాల శాఖ, ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ను సమన్వయం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణయించిన తేదీల్లో కార్యక్రమాలు పూర్తి చేయడంతోపాటు రైతులకు ప్రాజెక్టుపై స్పష్టమైన అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో నీరు, ఉద్యాన పంటలు, రహదారులు, మార్కెటింగ్, ప్రాసెసింగ్, ఎగుమతులను సమగ్రంగా అనుసంధానం చేస్తున్నాం. ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయి ఫలితం రైతు ఆదాయంలో కనిపించాలి. ప్రతి పథకం ప్రయోజనం చివరి రైతు వరకు చేరాలి. రాయలసీమను ఉద్యాన సిరులతో అభివృద్ధి చేసి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జాతీయ స్థాయిలో ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖకు అరుదైన గౌరవం..

-‘స్కోచ్ సిల్వర్ పురస్కారం’ దక్కించుకున్న ఐ&పీఆర్ శాఖ -ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు గోల్డ్ స్కోచ్ అవార్డు -మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *