-రాజమహేంద్రవరం 4వ ఐ.ఆర్. బెటాలియన్ సెంటర్‌లో 2025–26 బ్యాచ్ శిక్షణ పూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం 4వ ఐ.ఆర్. బెటాలియన్ సెంటర్‌లో 2025–26 బ్యాచ్‌కు చెందిన 138 మంది ఎస్‌సీటీపీసీలు (APSP) పోలీస్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పోలీస్ గ్రౌండ్ లో పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 4వ ఐ.ఆర్. బెటాలియన్ కమాండెంట్ పి. సత్తిబాబు, ఇతర అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. పోలీస్ శాఖలోకి నూతనంగా అడుగుపెడుతున్న కానిస్టేబుళ్లు ప్రజల పట్ల బాధ్యత, అంకితభావం, క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వహించాలని సూచించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని విధుల్లోకి అడుగుపెడుతున్న కానిస్టేబుళ్లకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
శిక్షణలో పొందిన నైపుణ్యాలను విధుల్లో సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని పోలీస్ అధికారులు సూచించారు. శిక్షణ కాలంలో ఫైరింగ్, ఇండోర్, అవుట్‌డోర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ కానిస్టేబుళ్లను మంత్రి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసి అభినందించారు.
వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారు
* బెస్ట్ ఇండోర్: బి. నవీన్ – 1వ బెటాలియన్, ఏపీఎస్‌పీ
* బెస్ట్ అవుట్‌డోర్: ఏ. రాము నాయుడు – 1వ బెటాలియన్, ఏపీఎస్‌పీ
* బెస్ట్ ఫైరర్: ఎల్. శ్రీను – 1వ బెటాలియన్, ఏపీఎస్‌పీ
* బెస్ట్ ఆల్‌రౌండర్: వి. నవీన్ – 4వ బెటాలియన్, ఏపీఎస్‌పీ
ఈ కార్యక్రమంలో 4వ ఐ.ఆర్. బెటాలియన్ కమాండెంట్ పి. సత్తిబాబు, అదనపు ఎస్పీ (అడ్మిన్) పాటిల్ దేవరాజ్ మనీష్, ఐ.పి.ఎస్., సౌత్ జోన్ డీఎస్పీ ఏ. శివ ప్రియ, అసిస్టెంట్ కమాండెంట్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌సీటీపీసీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News