-వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని ఆదేశం
-రిజర్వాయర్లను నింపడం… వనరులకు నీళ్లు మళ్లించడంపై దృష్టి
-ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువన కొత్త బ్యారేజీల ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని సూచన
-భారీ వర్షాలతో వివిధ రిజర్వాయర్లల్లో 21 టీఎంసీల మేర నీటి మట్టాలు పెరిగాయని అధికారుల వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులు, రిజర్వాయర్లలో పెరిగిన ప్రవాహాలు, ముంపు పరిస్థితులపై శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటలు ముంపునకు గురైన పరిస్థితి, తీసుకుంటున్న సహాయక, పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయాన్ని అందించేందుకు అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎగువనున్న రాష్ట్రాల నుంచి ప్రస్తుతం పెద్దగా ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరద నీటి కారణంగానే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్థానికంగా వచ్చే వరద నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే పులిచింతల-ప్రకాశం బ్యారేజీ మధ్యన ఓ కొత్త బ్యారేజీ నిర్మాణం అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ప్రకాశం బ్యారేజీ దిగువన కూడా ఇంకో బ్యారేజీ నిర్మించాల్సిన అవసరాన్ని గతంలోనే ఆలోచన చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ రెండు బ్యారేజీల నిర్మాణానికి గతంలో రూపొందించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. హిర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో తక్షణమే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. లిఫ్ట్ పనులను పూర్తి చేసి వంశధార నీటిని హిర మండలం రిజర్వాయర్‌లోకి తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వివిధ జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం సమీక్షించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోస్తాంధ్రలో ప్రస్తుతం 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, అయితే ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగించాలని సీఎం ఆదేశించారు.
రిజర్వాయర్లల్లో నీటి మట్టాలు… బేసిన్ల వారీ ప్రవాహాలపై సీఎం ఆరా
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లల్లో నీటి మట్టాలు ఎలా ఉన్నాయి..? అలాగే వివిధ నదుల పరీవాహక ప్రాంతాల్లో ప్రవాహాల వివరాలను సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 29 రిజర్వాయర్లల్లో నీటి మట్టాలు పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సెప్టెంబర్ 23వ తేదీన ఆయా రిజర్వాయర్లలో నీటి మట్టాలు 101 టీఎంసీలు ఉండగా… 26వ తేదీ నాటికి 21 టీఎంసీలు మేర నీటి మట్టాలు పెరిగాయని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టుల పరిధిలో సుమారు 5 టీఎంసీల మేర నీటి మట్టాలు పెరిగాయని తెలిపారు. ఇక కాకినాడ, పోలవరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని 18 రిజర్వాయర్ల పరిధిలో సుమారు 16 టీఎంసీల మేర నీటి మట్టాలు పెరిగాయని అధికారులు వెల్లడించారు. పెరిగిన ఈ నీటి మట్టాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక వివిధ బేసిన్లల్లోని ప్రవాహాల విషయానికొస్తే… కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార బేసిన్లల్లో నీటి ప్రవాహాలు గతంతో పోల్చుకుంటే పెరిగాయని అధికారులు వివరించారు. ఉత్తరాంధ్రలో నదుల ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలు, నిల్వ పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు వివరించారు. వంశధార పరివాహక ప్రాంతంలో గోట్టా బ్యారేజీకి సెప్టెంబరు 20న 7,214 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 25న 47,100 క్యూసెక్కులకు పెరిగిందని అధికారులు తెలిపారు. నాగావళి పరివాహక ప్రాంతంలోని నారాయణపురం ఆనకట్టకు ఇన్‌ఫ్లో 2,100 నుంచి 49,800 క్యూసెక్కులకు పెరిగిందని, మడ్డువలస ప్రాజెక్టులో గతంలో 918 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటే.. ప్రస్తుతం 18 వేల క్యుసెక్కుల మేర నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో మడ్డువలస ప్రాజెక్టులో నీటి నిల్వ నీటి నిల్వ 1.61 టీఎంసీల నుంచి 2.79 టీఎంసీలకు చేరిందని వివరించారు.తోటపల్లి బ్యారేజీకి కూడా భారీగా ప్రవాహం వచ్చిందని తెలిపారు. ఈ బ్యారేజీ వద్ద గతంలో 2,484 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు ఉండగా… ప్రస్తుతం 23,250 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉందని అధికారులు వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు పెరిగాయని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 20న 11.67 టీఎంసీలుగా ఉన్న డొంకరాయి రిజర్వాయర్ నిల్వ సెప్టెంబర్ 25వ తేదీ నాటికి 15.78 టీఎంసీలకు చేరిందని, సీలేరు (గుంటవాడ) రిజర్వాయర్‌లో నిల్వ 1.52 నుంచి 3.90 టీఎంసీలకు పెరిగిందని వివరించారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భారీగా ప్రవాహాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ సెప్టెంబర్ 20వ తేదీన 1.20 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటే… ఈ నెల 25వ తేదీ నాటికి ఆ ప్రవాహాలు 3.50 లక్షల క్యూసెక్కులకు చేరిందని అధికారులు వెల్లడించారు. సెప్టెంబరు 20న ప్రకాశం బ్యారేజీకి 8,187 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 25న అది 40,521 క్యూసెక్కులకు పెరిగినట్లు తెలిపారు. మున్నేరుకు వచ్చే ప్రవాహం కూడా 3,210 నుంచి 9,000 క్యూసెక్కులకు పెరిగిందని వివరించారు. పెరిగిన ప్రవాహాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. ఓవైపు సహయక చర్యలపై దృష్టి పెడుతూనే.. మరోవైపు రిజర్వాయర్లకు నీటని మళ్లించే అంశంపై దృష్టి సారించాలన్నారు. అలాగే చిన్న, మధ్య తరహా నీటి వనరులను కూడా నింపాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగం ఉండాలని.. అలాగే నీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సహా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఈ టెలీకాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News