-ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల రెండు రోజుల వర్క్‌షాప్
-సదస్సుకు హాజరుకానున్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
-29వ తేదీన సదస్సును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా మిషన్ కర్మయోగిపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్ విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖలా పేరిట ఈ నెల 29, 30 తేదీల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో రెండు రోజుల పాటు సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, సంబంధిత భాగస్వాములు ఇందులో పాల్గొననున్నారు. 29తేదీన జరిగే ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కూడా హాజరుకానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణ సంస్థల కెపాసిటి బిల్డింగ్, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్, మిషన్ కర్మయోగి వేదిక వినియోగంపై ప్రదర్శన ఇవ్వనున్నారు. మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్, కర్మయోగి కర్తవ్య కార్యక్రమం కింద వివిధ శిక్షణా సంస్థల పాలనకు సంబంధించిన ముసాయిదా ఫ్రేమ్ ఈ సదస్సులో చర్చ జరగనుంది. అంతర్రాష్ట్ర బృందాల కార్యకలాపాలు, ప్రశ్నోత్తరాల ద్వారా వివిధ రాష్ట్రాల అనుభవాలు, ఉత్తమ విధానాలను పంచుకోనున్నారు.
రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజెంటేషన్లు
ఈనెల 29న ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం వివిధ అంశాలపై సాంకేతిక సమావేశాలు జరుగుతాయి. సెప్టెంబర్ 30న నిపుణుల సమావేశం, రాష్ట్రాల ప్రదర్శనలు, బృంద చర్చలతో వర్క్‌షాప్ ముగియనుంది. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా, ఆయా శాఖల పనితీరును మెరుగు పరిచే భాగస్వాములుగా ఎదగాలన్నది ఈ వర్క్‌షాప్ ప్రధాన సందేశం. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకునేందుకు, ప్రజలకు అందే సేవల నాణ్యతను పెంచే శిక్షణ పద్ధతులపై కలిసి పనిచేసేందుకు విజయవాడ వేదిక కానుంది. పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య ఉత్తమ విధానాలను పరస్పరం మార్చుకునేందుకు ఈ కార్యశాల కీలకంగా మారనుంది.
Prajavartha Online Telugu News