Breaking News

తొలిసారి రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

-మంత్రి కందుల దుర్గేష్
-సెప్టెంబర్ 27న రాజమండ్రితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల నిర్వహణ
-AI టెక్నాలజీతో ఏపీ టూరిజంలో కొత్త శకం.. 2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్’ ప్రచారం
-సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లతో.. ఏపీ టూరిజంపై ప్రత్యేక ప్రచారం
-కేరళ కోవాళం తరహాలో ఏపీ తీరంలో వెల్ నెస్ సెంటర్లు – ఆయుర్వేదం, యోగాలకు పెద్దపీట
-పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాతో ఊతం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల చొరవతో ఏపీలో క్యూ కడుతున్న ఇన్వెస్టర్లు..వారి నాయత్వంలో మారుతున్న ఏపీ పర్యాటక రూపురేఖలు
-కేంద్రంతో సత్సంబంధాలు, భారీ ప్రాజెక్టుల సాధన.. తిరుపతి, విశాఖలను గ్లోబల్ టూరిజం హబ్‌లుగా మారుస్తున్నామని పేర్కొన్న మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తొలిసారిగా రాజమహేంద్రవరం వేదికగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకల వివరాలను వెల్లడించారు. కేవలం రాజమండ్రిలోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంజీరా హోటల్ వేదికగా జరగనున్న ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలకు జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని అన్నారు.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో పర్యాటక రంగానికి సంబంధించి కొత్త కార్యాచరణతో ‘రాజమండ్రి డిక్లరేషన్’ను ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

సాంకేతికతతో పర్యాటకాభివృద్ధి – ఏఐ టెక్నాలజీ జోడంపు*

ఇప్పటివరకు సాంప్రదాయ పద్ధతుల్లో సాగిన పర్యాటకాభివృద్ధిని, ఇకపై పూర్తిగా సాంకేతిక ఆధారితంగా మారుస్తున్నట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

ఎక్స్ ప్లర్జర్ సంస్థతో ఒప్పందం:

రాష్ట్రంలోని 130 పర్యాటక ప్రాంతాల్లో 130 భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ద్వారా ఆయా ప్రాంతాల సమాచారాన్ని, ప్రాశస్త్యాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఇన్ఫ్లూయెన్సర్లు, క్రియేటర్ ల ద్వారా ప్రచారం:

పర్యాటక ప్రాంతాలకు వచ్చే యాత్రికులు ఒకటి రెండు రోజులతో సరిపెట్టకుండా, మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఆకర్షించేందుకు క్రియేటర్లతో, ఇన్ఫ్లూయెన్సర్లతో ప్రత్యేక డాక్యుమెంటరీలు చేయించి ప్రదర్శించనున్నామన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేష్ పర్యాటకశాఖాధికారులతో కలిసి రాజమహేంద్రవరం నుండి హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఆ బస్సుల్లో ఇన్ఫ్లూయెన్సర్లు రాజమహేంద్రవరం సమీపంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించి మంచి రీల్స్ తయారు చేసి విశ్వవ్యాప్తం చేస్తారని తెలిపారు. పర్యాటక ప్రాంతాల ప్రచారంలో సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్ల పాత్ర కీలకం అన్నారు. ఈ ప్రాంతంలో జరిగే పర్యాటకాభివృద్ధి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. అంతేగాక గోదావరి మాతకు ఇచ్చే హారతిని తిలకించాలన్నారు.

క్రూజ్,కారవాన్ టూరిజం:

సముద్రంలో కార్డెలియా క్రూజ్ ను విశాఖ-చెన్నై-పాండిచ్చేరి మధ్య ఇప్పటికే ప్రారంభించామన్నారు. అలాగే కాకినాడ తీరం నుండి హోప్ ఐల్యాండ్, కోరింగ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో మరో రివర్ క్రూజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కారవాన్ టూరిజం, హోమ్ స్టేలు, టెంట్ సిటీలతో వినూత్నంగా ముందుకు వెళ్తున్నామన్నారు.

రూ.430 కోట్లతో కేంద్ర ప్రభుత్వ సహకార ప్రాజెక్టులు

కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రానికి 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ.428 కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. వాటిలో స్వదేశీ దర్శన్ 2.0 క్రింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ. 97.52 కోట్లు,బొర్రా గుహలకు రూ. 29.87 కోట్లు,సాస్కి క్రింద అఖండ గోదావరి పునరుద్ధరణకు రూ. 94.44 కోట్లు, గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లు, ప్రసాద్ స్కీమ్ కింద అన్నవరం దేవస్థానానికి రూ. 25.32 కోట్లు, సింహాచలంకు రూ. 54.04 కోట్లు, అదే విధంగా సీబీడీడీ క్రింద అహోబిలం స్పిరిచువల్ ఒడిస్సీకి రూ. 24.96 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్‌కు రూ. 25 కోట్లు మంజూరు అయ్యాయని, యుద్ధప్రాతిపదికన పర్యాటక అభివృద్ధి చేస్తున్నామన్నారు.బొర్రా గుహల్లో లైట్ అండ్ సౌండ్ షోలు, పర్యాటక ప్రాంతాల్లో 3, 5, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.ఇవే గాక ప్రసాద్ స్కీం క్రింద అరసవిల్లి దేవాలయాన్ని కేంద్ర సహకారంతో మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించామన్నారు. తిరుపతి, విశాఖపట్నంను అంతర్జాతీయ స్థాయి ప్రధాన పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దడానికి కేంద్రం అంగీకరించిందని స్పష్టం చేశారు.కేరళ కోవాళం బీచ్ తరహాలో ఏపీలోని సుదీర్ఘ సముద్ర తీరంలో వెల్ నెస్ సెంటర్ల (ఆయుర్వేదం, యోగా) ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలోనే తుది నిర్ణయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఆమోదంతో రుషికొండ ప్యాలెస్ వినియోగంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా, సీఆర్‌జెడ్ (CRZ) నిబంధనలకు లోబడి విశాఖలో గ్రామసభ నిర్వహించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూప్, అట్మాస్పియర్ కోర్ వంటి ప్రతిష్టాత్మక గ్రూప్ హోటల్స్ ముందుకు వచ్చాయని, పెట్టుబడిదారుల ఆసక్తి మేరకు తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత పాలకులు రుషికొండ ప్యాలెస్‌ను ఇష్టారీతిన నిర్మించారని, వ్యక్తిగత వినియోగం కోసం అత్యంత విలాసవంతంగా నిర్మించారని విమర్శించారు. వీలైనంత త్వరగా రుషికొండ ప్యాలెస్‌లు వినియోగానికి తెస్తామని స్పష్టం చేశారు.. రుషికొండ ప్యాలెస్ ను ఆతిథ్యరంగానికి వినియోగించేలా చర్యలు చేపడతామన్నారు. గతంలో రుషికొండ రిసార్టు ద్వారా ఏటా రూ.15 కోట్లు ఆదాయం వచ్చేదని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పర్యాటకశాఖ ఆదాయం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు..రుషికొండపై ఉన్న 9 ఎకరాల్లో 7.5 ఎకరాలు సీఆర్‌జెడ్‌లో ఉండగా, కేవలం 1.5 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు..

2027 గోదావరి పుష్కరాల ఘన నిర్వహణ

2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, అద్భుతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.పుష్కరాలకు కర్టెన్ రైజర్‌గా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘ది గోదావరి కాల్స్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాళ్లబండి సుబ్బారావు, రాజరాజనరేంద్రుడు, ఆదికవి నన్నయ్య తదితరుల స్మరణతో తెలుగు కళా వైవిధ్యాన్ని ప్రదర్శించబోతున్నట్లు చెప్పారు. బ్రిడ్జిలంకలో టెంట్ సిటీలు, వాటర్ ఫ్రంట్ గేమ్స్, మరియు పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

త్వరలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రోడ్ షోలు..

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారని, ల్యాండ్ అలాట్ మెంట్ పాలసీ ద్వారా పారదర్శకంగా భూములు కేటాయిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. త్వరలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రోడ్ షోలు నిర్వహించి పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు.

రాజమహేంద్రవరం సమీపంలోని పిచ్చుకలంకలో ఒబెరాయ్ హోటల్ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉందని తెలిపారు. అలాగే అనపర్తికి చెందిన వ్యక్తి ఫిల్మ్ స్టూడియో, స్టార్ హోటల్, రిసార్ట్ ఏర్పాటుకు ముందుకు రాగా.. చైతన్యరాజు, గండి భాస్కర్ రావు సొంత స్థలంలో రిసార్ట్ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు.

ఎకో టూరిజం ఎంఓయూలు

ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసే దిశగా వివిధ శాఖలతో ప్రత్యేకంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.

ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ఇండియన్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యక్రమం వల్ల దేశవ్యాప్తంగా పలువురు ఇన్వెస్టర్లు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని, కొత్తగా ఎంఓయూలు కూడా చేసుకుంటున్నామని పేర్కొన్నారు..

కళారంగానికి పునరుజ్జీవం – నంది అవార్డుల ప్రదానోత్సవం*

నిరాదరణకు గురైన కళారంగానికి కూటమి ప్రభుత్వం పూర్వవైభవం తెస్తోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. డిసెంబర్‌లో విజయవాడ లేదా అమరావతిలో నంది ఫిల్మ్ అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.జనవరిలో తెనాలిలో నంది నాటకోత్సవాలను వైభవంగా నిర్వహించడంతో పాటు నాటకరంగ కళాకారులకు కందుకూరి పురస్కారాలు అందిస్తామన్నారు.ఇప్పటికే చాలామంది కవులు, కళాకారులను ఉగాది పురస్కారాలతో పాటు బోయి భీమన్న, గుర్రం జాషువా, గిడుగు రామమూర్తి పంతులు వంటి మహానుభావుల పేరిట అవార్డులు అందజేసి సత్కరించమన్నారు.

కూటమి ధర్మం పాటిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ

కూటమి ధర్మాన్ని పాటిస్తూనే అక్టోబర్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఇప్పటికే పార్టీలకు విడిగా, కూటమికి విడిగా సమన్వయ కమిటీలు ఏర్పాటయ్యాయని, తరుచూ ఆ భేటీల్లో పాల్గొని బలబలాలు చర్చిస్తున్నామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

వివాదాలపై స్పష్టత:

ఉండ్రాజవరంలో వంగవీటి మోహనరంగా విగ్రహ ఏర్పాటుపై స్పందిస్తూ, అందరికీ ఆమోదయోగ్యమైన మెరుగైన స్థలాన్ని గుర్తించామని, ఇందులో ఎలాంటి వివాదం లేదని తేల్చిచెప్పారు.

రాజమహేంద్రవరంలో రిజర్వ్ దళాల శిక్షణ పూర్తి

రాజమహేంద్రవరంలో 138 మందితో కూడిన ఇండియన్ రిజర్వ్ దళానికి కఠినమైన శిక్షణ పూర్తయిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. సైబర్ క్రైమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలతో పాటు, చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మానవ విలువలపై శిక్షణ పొందారని, రేపటి నుండే వారు విధుల్లోకి చేరతారని వెల్లడించారు.

ఈ సందర్భంగా రెండున్నరేళ్ల క్రితం నాటి ఏపీ పర్యాటక రంగానికి, ప్రస్తుత స్థితికి మధ్య ఉన్న స్పష్టమైన మార్పును గమనించాలని మంత్రి దుర్గేష్ ప్రజలను, మీడియాను కోరారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జాతీయ స్థాయిలో ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖకు అరుదైన గౌరవం..

-‘స్కోచ్ సిల్వర్ పురస్కారం’ దక్కించుకున్న ఐ&పీఆర్ శాఖ -ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు గోల్డ్ స్కోచ్ అవార్డు -మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *